Fake News, Telugu
 

సన్ హేలో దృశ్యాన్ని చూపిస్తున్న ఒక పాత వీడియోని గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్‌లో ఇటీవల ఏర్పడిన పూర్తి వృత్త ఇంద్రధనస్సు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

సుమారు 150 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో సంభవించే భీష్మ ధనుస్సు ఇటీవల గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్‌లో కనిపించిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: 150 సంవత్సరాలకు ఒకసారి సంభవించే పూర్తి వృత్త ఇంద్రధనస్సు ఇటీవల గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్‌లో కనిపించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఆకాశంలో సూర్యుడి చుట్టూ సహజంగా ఏర్పడే వృత్తాకార వలయం (సన్ హేలో అని కూడా పిలుస్తారు) దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న సన్ హేలో దృశ్యాలు మహారాష్ట్ర పూణే నగరంలో కనిపించిందని పలు వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా యూసర్లు 2015 నుండి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ఇండియా టైమ్స్’ వార్త సంస్థ 24 జూన్ 2015 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మహారాష్ట్ర పూణే నగరంలో పూర్తి వృత్తం ఇంద్రధనస్సు కనిపించిన అద్భుత దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోని చాలా మంది యూసర్లు 2015 నుండి తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉన్నారు.

వాతావరణంలో ఉండే నీటి బిందువుల నుంచి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి విక్షేపణం చెందడం వలన ఆకాశంలో ఇంద్ర ధనస్సు ఏర్పడుతుంది. ఇదే విధంగా సూర్యుడు లేదా చంద్రుడి నుండి వచ్చే కాంతి కిరణాలు, ఆకాశంలో అధిక ఎత్తులో ఉండే సిరోస్ట్రాటస్ మేఘాలలోని మంచు స్ఫటికాల ద్వారా వక్రీభవనానికి గురైనప్పుడు, ఈ సన్ హేలోలు (సూర్య వృత్తాకార వలయాలు) ఏర్పడుతుంటాయి. భూమిపై ఏదైన ప్రదేశం నుంచి సూర్యున్ని వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఏర్పడిన వృత్తం వ్యాసార్ధం 22 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే, ఈ వృత్తం ఏర్పడే ప్రక్రియను ’22 డిగ్రీ వృత్తం’ అని పిలుస్తుంటారని పలు శాస్త్రీయ నివేదికలు, వార్తా రిపోర్టులలో తెలిపారు.

ఆకాశంలో ఈ వృత్తాకార వలయాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. భారత దేశంలో గతంలో పలు ప్రాంతాలలో ఈ వృత్తాకార వలయాలు కనిపించాయి. వాటికి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సన్ హేలో దృశ్యాలను చూపిస్తున్న సంబంధం లేని ఒక పాత వీడియోని గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్‌లో ఇటీవల ఏర్పడిన పూర్తి వృత్త ఇంద్రధనస్సు దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll