Fact Check, Fake News, Telugu
 

ఉత్తర్ ప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల సంఖ్యకు సంభందించిన ఈ సమాచారం తప్పు

0

గత 70 ఏళ్ళ లో 2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, యోగీ ఆదిత్యనాథ్ 2017 మార్చి లో ముఖ్యమంత్రి అయ్యాక ఈ నాలుగేళ్ళలోనే కొత్తగా 30 మెడికల్ కాలేజీలు కట్టించాడని, మరో 40 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: 2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉండేవి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక 4 ఏళ్లలో 30 కట్టించాడు.

ఫాక్ట్: 2017 లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 45 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, 2017 నాటికే ఇంకా అదనపు 11 కాలేజీలు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నవి ఉన్నాయి. ఫిబ్రవరి 2021 నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 57 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, అంటే 2017 నుండి ఇప్పటి వరకు కొత్తగా వచ్చినవి 12 మాత్రమే. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ వెతికినప్పుడు కొన్ని ఆర్టికల్స్ లో, 2017లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని సిఎం తెలిపారని, ప్రస్తుతం మరో ముప్పై నిర్మించబడుతున్నాయి మరియు 75 జిల్లాల్లో ప్రతి దానిలో ఒకటి ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని తెలిపారు. ఆ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఆ ఆర్టికల్స్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (UPANA) బ్యానర్ కింద ఏర్పాటు చేసిన పెట్టుబడి మరియు పర్యాటక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఇలా అన్నారని తెలుస్తుంది. UPANA వారి వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అందులో యోగీ ఆదిత్యనాథ్ 13 డిసెంబర్ 2020 లో మాట్లాడిన ఆ వీడియో యొక్క ‘యు ట్యూబ్’ లింక్ ఉంది. ఆ వీడియో లో యోగి ఆదిత్యనాథ్, 1947 నుండి 2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టారని, 2017 నుండి 2020 వరకు మరో 30 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు నిర్మాణంలో ఉన్నాయని చెబుతున్నట్టు తెలుస్తుంది.      

లోక్ సభలో, 2017 మరియు 2021 లో, దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల గురించి ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య సమాచారం ఇవ్వటం జరిగింది. 2017 లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే నాటికీ ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 45 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, 2017 నాటికే ఇంకా అదనపు 11 కాలేజీలు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నవి ఉన్నాయి. ఫిబ్రవరి 2021 నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 57 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, అంటే 2017 నుండి ఇప్పటి వరకు కొత్తగా వచ్చినవి 12 మాత్రమే.        

ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాల్లో ప్రతి ఒక్కదానిలో మెడికల్ కాలేజీ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోచిస్తున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి కాలేజీ లేని 16 జిల్లాల్లో ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్య (PPP) నమూనాపై త్వరలో మెడికల్ కాలేజీలు  ప్రారంభించబడతాయని, మరికొన్ని అప్ గ్రేడ్ చేయబడతాయని, దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఈ మధ్య రాజ్య సభలో మెడికల్ కాలేజీ లకు సంబంధించి వివరాలు ఇస్తూ, ఒక స్కీం కింద ఉత్తర్ ప్రదేశ్ కు 27 కొత్త మెడికల్ కాలేజీ లు రాబోతున్నట్టు తెలిపారని ఈ ఆర్టికల్ ద్వారా చూడొచ్చు.

చివరగా, ఉత్తర్ ప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలకు సంభందించి పోస్టులో షేర్ చేస్తున్న సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll