ముస్లిం దేశం అయిన ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (128 అడుగుల) శ్రీ గణేష్ విగ్రహం ఉందంటూ ఒక భారీ గణేష్ విగ్రహం వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇండోనేషియాలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (128 అడుగుల) శ్రీ గణేష్ విగ్రహ వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని గణేష్ విగ్రహం ఉన్నది థాయ్‌లాండ్‌లోని చాచోంగ్‌సావోలోని ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో, ఇండోనేషియాలో కాదు. ఇండోనేషియాలో కూడా వినాయకుడి విగ్రహలు ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలో ఉన్నది ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహాం అన్నది నిజమే అయినప్పటికీ ఈ విగ్రహం ఉన్నది థాయిలాండ్‌లో, పోస్టులో చెప్తున్నట్టు ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కాదు.
ఈ విగ్రహనికి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్‌లలో ఈ విగ్రహం ఫోటోలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వెబ్‌సైట్‌లలో ఈ విగ్రహం థాయ్‌లాండ్‌లోని చాచోంగ్‌సావోలోని ఖ్లాంగ్ ఖుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో ఉన్నట్టు పేర్కొన్నారు.
థాయిలాండ్ పర్యాటక వెబ్‌సైట్‌లో ఈ విగ్రహనికి సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చు. ఈ సమాచారం ప్రకారం ఈ విగ్రహం ఎత్తు 39 మీటర్లు (సుమారు 128 అడుగులు), దీని నిర్మాణం 2009లో మొదలైంది.
వీటన్నిటిబట్టి వైరల్ వీడియో ఉన్న విగ్రహం థాయిలాండ్‌లో ఉన్న విషయం స్పష్టమవుతుంది. ఇకపోతే ఇండోనేషియాలో కూడా వినాయకుడికి ప్రాముఖ్యత ఉంది. ఇండోనేషియా కరెన్సీపై కూడా ఒకప్పుడు వినాయకుడి బొమ్మని ముద్రించారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఇండోనేషియాలో 700 ఏళ్ళ నాటి వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఐతే వైరల్ పోస్టులో ఉన్న విగ్రహనికి ఇండోనేషియాతో ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, ఈ 128 అడుగుల గణేష్ విగ్రహం ఉన్నది థాయిలాండ్‌లో, ఇండోనేషియాలో కాదు.