అభిమాని ఫోన్‌ని విసిరేసిన రణబీర్ కపూర్ అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో సేల్ఫీ కోసం ప్రయత్నించిన ఒక అభిమాని ఫోన్‌ని రణబీర్ కపూర్ విసిరేసిన దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: సేల్ఫీ కోసం ప్రయత్నించిన ఒక అభిమాని ఫోన్‌ని రణబీర్ కపూర్ విసిరేసిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): రణబీర్ కపూర్ ఒక అభిమాని ఫోన్‌ను విసిరేసిన ఈ దృశ్యాలు నిజంగా జరిగిన సంఘటనకు సంబంధించినవి కావు. ఇవి ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించినవి. OPPO సంస్థ తన కొత్త ఫోన్ (OPPO RENO 8T) ప్రచారంలో భాగంగా ఈ ప్రకటనను రూపొందించారు. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వీడియోలో ఫోన్ విసిరేసిన తరవాత ఆ అభిమానికి రణబీర్ కపూర్ కొత్త OPPO RENO 8T ఫోన్ అందిస్తాడు. ఐతే కేవలం ఈ ప్రకటనలోని మొదటి భాగం వైరల్ అవడంతో అందరూ ఇది నిజంగా జరిగిన ఘటన అనుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న వీడియోలో రణబీర్ కపూర్ ఒక అభిమాని ఫోన్‌ను విసిరేస్తుండడం చూడొచ్చు. ఐతే ఈ ఘటన నిజంగా జరిగింది కాదు. ఈ దృశ్యాలు ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించినవి. పైగా వైరల్ అయ్యింది ఈ ప్రకటనలోని కొంత భాగం మాత్రమే.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, OPPO సంస్థ తమ కొత్త మొబైల్ విడుదలకు సంబంధించి రూపొందించిన ఒక ప్రకటనలో భాగంగా ఈ దృశ్యాలను చిత్రీకరించినట్టు తెలిసింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో OPPO, ఈ ప్రకటనకు సంబంధించి మిగతా భాగాన్ని షేర్ చేసింది.
ఈ వీడియోలో రణబీర్ కపూర్ అభిమాని ఫోన్ విసిరేసిన తరవాత ఒక కొత్త ఫోన్ (OPPO RENO 8T) అతనికి ఇస్తాడు. దీన్నిబట్టి ఈ దృశ్యాలు ఒక ప్రకటన షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించినట్టు స్పష్టమవుతుంది.
ప్రకటనలో రణబీర్ కపూర్ అభిమానిగా నటించిన నైనేష్ కరంచందనీ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మిగతా భాగాన్ని షేర్ చేసాడు. రణబీర్ కపూర్ తన ఫోన్ విసిరేయలేదని, ఇది ఒక వాణిజ్య ప్రకటన అని తను స్పష్టం చేసాడు. ఐతే కేవలం ఈ ప్రకటనలోని మొదటి భాగం వైరల్ అవడంతో అందరూ ఇది నిజంగా జరిగిన ఘటన అనుకున్నారు.
చివరగా, రణబీర్ కపూర్ ఫోన్‌ని విసిరేసే ఈ దృశ్యాలు ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించినవి.