Fake News, Telugu
 

కశ్మీర్‌/దాల్ సరస్సును గత కొన్ని దశాబ్దాలుగా విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు

0

“విదేశీయులు కశ్మీర్‌కు వచ్చి దాల్ సరస్సులో విహరించడం చూసి 30 ఏళ్ళు దాటింది. మళ్ళీ ఇప్పుడు నరేంద్రుని పాలనలో సాధ్యమయింది” అంటూ బోటులో విహరిస్తున్న విదేశీయుల ఫోటో ఒకటి షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: 30 ఏళ్ల తరువాత మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత కశ్మీర్‌లోని దాల్ సరస్సును మళ్ళీ విదేశీయులు సందర్శిస్తున్నారు.

ఫాక్ట్(నిజం):  ప్రస్తుతం కశ్మీర్‌లో G20 దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ సమావేశాలకు వచ్చిన విదేశీ ప్రతినిధిలు దాల్ సరస్సును సందర్శించినప్పుడు తీసిందే. ఐతే జమ్ము-కశ్మీర్‌లో విదేశీ పర్యాటకం గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది. 1990ల్లో తరచూ నిరసనలు జరగడం వల్ల పర్యాటకం కొంచెం తగ్గినప్పటికీ, ఆ తరవాత క్రమంగా పుంజుకుంది. దీనికి సంబంధించి వార్తా కథనాలు, అధికారిక ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులు దాల్ సరస్సును సందర్శించిన ఫోటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మోదీ ప్రధానమంత్రి అయ్యాకే కశ్మీర్‌కు విదేశీ యాత్రికులు రావడం ఇదే మొదటిసారి అని అనడం అతిశయోక్తి అవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ నెల 22-24 మధ్య మూడు రోజులు కశ్మీర్‌లో G20 దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వచ్చిన చాలా మంది విదేశీ ప్రతినిధులు, అధికారులు కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా ఈ నేపథ్యంలోనే G20 ప్రతినిధులు శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో షికారా రైడ్ చేస్తున్నప్పుడు తీసింది.

ఐతే ఇప్పుడు జరుగుతున్న G20 సమావేశాల నేపథ్యంలో కశ్మీర్‌లో విదేశీయుల పర్యటన గురుంచి చెప్తూ కేవలం మోదీ ప్రధానమంత్రి అయిన తరువాతే ఇలా జరిగిందనడంలో వాస్తవం లేదు. మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన 2014 కన్నా ముందు కూడా కశ్మీర్/ దాల్ సరస్సులో విదేశీ పర్యాటకులు వస్తుండేవారు. అప్పట్లో కశ్మీర్‌లో పర్యాటకంపై ఎటువంటి నిషేధం లేదు.

దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కాకశ్మీర్‌ను విదేశీ పర్యటకులు సందర్శించే వారని ధృవీకరించే కొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి ఒక కథనం ప్రకారం 2011లో కశ్మీర్‌ను 10 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు, అంతకు ముందు రెండు దశాబ్దాలలో ఇది అత్యధికం.

పైగా కేవలం దేశీయ పర్యాటకులు మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా కశ్మీర్‌ను సందర్శించారు. ఈ కథనం ప్రకారం 2009లో కశ్మీర్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 54,475 కాగా, 2010లో ఈ సంఖ్య 48,099గా నమోదైంది. ఐతే 2011లో ఈ సంఖ్య మరింత పెరిగిందని ఈ కథనం పేర్కొంది.

పోస్టులో చేస్తున్న వాదనకు వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో కూడా కశ్మీర్/దాల్ సరస్సులో విదేశీ పర్యాటకులు వస్తుండేవారు అనడాన్ని ధృవీకరించేలా 2008లో విదేశీ పర్యాటకులు దాల్ సరస్సును సందర్శించిన పలు ఫోటోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే 1990ల్లో కశ్మీర్‌లో వేర్పాటువాదుల నిరసనలు, ఉగ్రవాద కార్యక్రమాలు, మొదలైన సంఘటనలు తరచూ జరుగుతుండడంతో ఇతర దేశాలు కశ్మీర్‌ను సందర్శించే తమ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుండేవి. ఆ తరవాత ఈ వాతావరణం క్రమంగా మెరుగవడంతో కశ్మీర్‌లో పర్యాటకం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

గత అక్టోబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం కశ్మీర్‌ను సుమారు 1.62 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఐతే చాలా ఏళ్ళ తరవాత కేవలం మోదీ ప్రధానమంత్రి అయ్యాకే కశ్మీర్‌కు విదేశీ యాత్రికులు రావడం ఇదే మొదటిసారి అని అనడం అతిశయోక్తి అవుతుంది.

చివరగా, కశ్మీర్‌ను గత కొన్ని దశాబ్దాలుగా విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll