అయోధ్య రామ మందిరం దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్య రామ మందిరం దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ‘ప్రేమ మందిరం’ దేవాలయం, అయోధ్య రామ మందిరం కాదు. మథుర జిల్లా బృందావనం సమీపంలో నిర్మించబడిన ఈ ‘ప్రేమ మందిరం’ దేవాలయంలో రాధాకృష్ణులని మరియు సీతారాములని పుజిస్తారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 2019 పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ‘ప్రేమ మందిరం’ దేవాలయమని ఆ యూసర్ వివరణలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న భవనం పై ‘प्रेम मंदिर’ అనే హిందీ అక్షరాలు రాసి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పోస్టులో షేర్ చేసిన అదే దేవాలయం యొక్క ఫోటోలని పలు టూరిస్ట్ వెబ్సైట్లు షేర్ చేస్తూ, ఈ ఫోటోలలో కనిపిస్తున్నది మథుర జిల్లా బృందావనం సమీపంలో నిర్మించిన ‘ప్రేమ మందిరం’ దేవాలయమని తెలిపారు. టూరిస్ట్ వెబ్సైట్లు ‘ప్రేమ మందిరం’ దేవాలయానికి సంబంధించి తెలిపిన సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
‘Amar Ujala’ మరియు ‘Zee News’ న్యూస్ సంస్థలు ‘ప్రేమ మందిరం’ దేవాలయ ఫోటోలని తమ అర్టికల్స్‌లో పబ్లిష్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న అదే దేవాలయ భవన దృశ్యాలు ఈ ఫోటోలలో మనం చూడవచ్చు. మథుర జిల్లా బృందావనం సమీపంలో నిర్మించిన ఈ ‘ప్రేమ మందిరం’లో రాధాకృష్ణులని మరియు సీతారాములని కొలుస్తారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ‘ప్రేమ మందిరం’ దేవాలయమని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల ఫోటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు 31 మే 2021 నాడు పెట్టిన ట్వీట్ లో షేర్ చేసారు. ఈ ఫోటోలలో రామ మందిర నిర్మాణ పనుల ప్రక్రియలో ఇంకా పునాది రాళ్లు కూడా వేయనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ‘India TV’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో డిసెంబర్ 2021 నుండి అయోధ్య రామ మందిర రాతి పనులు మొదలవుతాయని తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల పూర్తి అవొచ్చని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, మథుర జిల్లాలోని ‘ప్రేమ మందిరం’ దేవాలయంలోని దృశ్యాలని అయోధ్య రామ మందిరం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.