Fake News, Telugu
 

ఈ వీడియోలోని బైక్‌లో బ్యాటరీ ఉంటుంది; కేవలం సైకిల్ తొక్కినట్లు తొక్కడం ద్వారా 90 kmph స్పీడ్ వెళ్లదు

0

పెట్రోల్ కానీ, బాటరీ కానీ అవసరం లేదు; సైకిల్ తొక్కినట్లు తొక్కడమే 90 kmph (గంటకు 90 కిలోమీటర్లు) స్పీడ్ వెళ్తుంది’, అని చెప్తూ ఒక బైక్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలోని బైక్‌కి పెట్రోల్ కానీ, బాటరీ కానీ అవసరం లేదు; సైకిల్ తొక్కినట్లు తొక్కితే చాలు 90 kmph స్పీడ్ వెళ్తుంది.

ఫాక్ట్: వీడియోలోని ‘eROCKIT’ బైక్‌లో బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్లకు పైగా వెళ్లవచ్చని వారి వెబ్‌సైట్‌లో రాసి ఉంది. కాకపోతే, వేరే బైకుల్లో ఉన్నట్టుగా యాక్సిలేటర్‌ చేతి దగ్గర ఉండదు; పెడల్ తొక్కే వేగం బట్టి, బండి వేగం ఉంటుంది. బ్యాటరీ ద్వారా నడిచినా, వేగం మాత్రం పెడల్ తొక్కడం బట్టి నియంత్రించవొచ్చు. కావున, బ్యాటరీ అవసరం లేదని, కేవలం తొక్కితే చాలు 90 kmph స్పీడ్ వెళ్తుందని పోస్ట్‌లో చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియోలో ఉన్న బైక్ పేరు ‘eROCKIT’ అని చూడవొచ్చు. ఆ బైక్ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, పోస్ట్‌లో ఉన్న వీడియోని ‘eROCKITGermany’ కంపెనీ వారు ఫిబ్రవరి 2020లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపిస్తున్నది పెడల్ నియంత్రిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని వివరణలో రాసినట్టు చదవొచ్చు. అంతేకాదు, వేరే ఎలక్ట్రిక్ బైక్‌లకు పెట్టినట్టు ‘eROCKIT’ బైక్‌కి కూడా ఛార్జింగ్ పెట్టాలా అని కామెంట్ సెక్షన్‌లో ఒకరు అడగగా, సాధారణ సాకెట్‌లో నాలుగు గంటలు పెట్టాలని ‘eROCKITGermany’ వారు బదులిచ్చినట్టుగా చూడవొచ్చు.

‘eROCKIT’ బైక్‌లో బ్యాటరీ సామర్థ్యం 6.6 kWh అని, ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్లకు పైగా వెళ్లవచ్చని వారి వెబ్‌సైట్‌లో రాసినట్టు ఇక్కడ చదవొచ్చు.

కాకపోతే, వేరే బైక్‌లల్లో ఉన్నట్టుగా యాక్సిలేటర్‌ చేతి దగ్గర ఉండదు; పెడల్ తొక్కే వేగం బట్టి, బండి వేగం ఉంటుంది. బైక్ బ్యాటరీ ద్వారా నడిచినా, వేగం మాత్రం పెడల్ తొక్కడం బట్టి నియంత్రించవొచ్చు. పెడల్ తొక్కే శైలి, వేగం బట్టి, సుమారు 50 రెట్లు శక్తితో బండి పోతుందని, మరియు గరిష్టంగా సుమారు 90 kmph వేగంగా బైక్ వెళ్తుందని ‘eROCKITGermany’ వారు పెట్టిన పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. ‘eROCKIT’ బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, వీడియోలోని బైక్‌లో బ్యాటరీ ఉంటుంది. కేవలం సైకిల్ తొక్కినట్లు తొక్కడం ద్వారా 90 kmph స్పీడ్ వెళ్లదు.

Share.

About Author

Comments are closed.

scroll