ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఒక ముస్లిం ఊబర్ టాక్సీ డ్రైవర్ 250 మంది హిందువులను చంపాడు అంటూ న్యూస్ ఆర్టికల్ ఫోటోతో ఉన్న ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): మీరట్ లో గత నాలుగు నెలల్లో 250 మంది హిందువులను చంపిన ఒక ముస్లిం ఊబర్ డ్రైవర్.
ఫాక్ట్ (నిజం): 2007లో డబ్బు కోసం చేసిన హత్యలను 2019 లో మతం పేరుతో చేసిన హత్యలు అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
పోస్ట్ లో ఇచ్చిన విషయాల గురించి గూగుల్ లో ‘Meerut 250 murders’ అని వెతకగా సెర్చ్ రిజల్ట్స్ లో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి. వాటిల్లో ‘Hindu Existence’ అనే వెబ్ సైట్ లో జూన్ 2, 2019 న ప్రచురించిన ఆర్టికల్ నుండే పోస్ట్ లో పెట్టిన ఫోటో తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే సెర్చ్ రిజల్ట్స్ లో ‘News18’ ఆర్టికల్ కూడా ఉంటుంది. ఆ ఆర్టికల్ చదువుతే ‘Hindu Existence’ ఆర్టికల్ మొత్తం ఇక్కడి నుండే కాపీ కొట్టినట్టు తెలుస్తుంది. కానీ ‘News18’ ఆర్టికల్ లో మతం కోసం చంపినట్టు ఎక్కడా రాసి ఉండదు. మతంకి సంబంధించిన వాఖ్యాలన్ని ‘Hindu Existence’ ఆర్టికల్ లో జోడించి రాసారు. అంతే కాదు ‘News18’ ఆర్టికల్ 2007 లో ప్రచురించబడింది. పోస్ట్ లో డ్రైవర్ సలీం ఊబర్ డ్రైవర్ అని రాసారు కానీ 2007 లో ఊబర్ సంస్థ అసలు లేదు, అది 2009 లో ఏర్పడింది.
అలానే పోస్ట్ లో నాలుగు నెలల్లో సలీం ఒక్కడే 250 మందిని చంపినట్టు ఉంది, కానీ నిజానికి నాలుగు ఏళ్ళలో 35 మంది ఉన్న ఒక గ్యాంగ్ 250 మందిని చంపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ లో చూడొచ్చు.
చివరగా, 2007 లోని కేసుని తీసుకొని మతం పేరుతో చేసిన హత్యలుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.