Fake News, Telugu
 

మోదీ ప్రభుత్వం UNMOGIP దౌత్యవేత్తల వీసాలను రద్దు చేసిందన్న వార్తలో నిజం లేదు

0

కశ్మీర్ అంశంలో చైనాను కూడా అంతర్భాగం చేయాలని ప్రతిపాదించిన UNMOGIP (యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్) దౌత్యవేత్తల వీసాలను రద్దు చేసి, వారిని వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని మోదీ ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కశ్మీర్ అంశంలో చైనాను కూడా అంతర్భాగం చేయాలని ప్రతిపాదించిన UNMOGIP దౌత్యవేత్తల వీసాలు రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.

ఫాక్ట్(నిజం): UNMOGIP కశ్మీర్ అంశంలో చైనాను కూడా అంతర్భాగం చేయాలని నివేదిక సమర్పించిందన్న వార్తలో, మోదీ ప్రభుత్వం UNMOGIP దౌత్యవేత్తల వీసాలు రద్దు చేసిందన్న వార్తల్లో నిజం లేదు. ఈ వార్తల్లో నిజంలేదని ఐక్యరాజ్య సమితి వారు కూడా స్పష్టం చేశారు. అసలు ఈ విషయంపై మీడియాలో ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

UNMOGIP:

UNMOGIP అనేది కశ్మీర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమలుకు సంబంధించి పర్యవేక్షణ కోసం 1949లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒక కమిటీ. ఈ కమిటీ కశ్మీర్‌లో కాల్పుల విరమణ అమలుకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పిస్తుంది.

ఐతే పోస్ట్‌లో చెప్తున్నట్లు కశ్మీర్ అంశంలో చైనాను కూడా అంతర్భాగం చేయాలని నివేదిక సమర్పించినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ UNMOGIP ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రతిపాదనను చేసి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది. కాని ఈ వార్తకు సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లేవు.

అలాగే, UNMOGIP దౌత్యవేత్తల వీసాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్న దానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఈ వార్తను ఏ మీడియా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదు. కాకపోతే, శ్రీనగర్‌లోని UNMOGIP కార్యాలయం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినట్టు అధికారులు వెల్లడించారని, ఇందుకుగాను అధికారులు UNMOGIPకి నోటిసులు ఇచ్చే అవకాశం ఉందని పలు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ).

ఐతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్‌లపై వివరణ కోరుతూ మేము ఐక్యరాజ్య సమితిని ఈమెయిల్ ద్వారా సంప్రదించగా, ఈ క్లెయిమ్స్ పూర్తిగా అవాస్తవం అని వారు స్పష్టం చేసారు. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్న వార్తలు నిజం కావని అర్ధం చేసుకోవచ్చు.

చివరిగా, మోదీ ప్రభుత్వంUNMOGIP దౌత్యవేత్తల వీసాలను రద్దు చేసిందన్న వార్తల్లో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll