Fake News, Telugu
 

ముస్లిం మహిళ గ్యాస్ సిలిండర్ మోసుకెల్లడానికి హిందూ సాధువు సహాయం చేస్తున్న ఈ దృశ్యాలు ఒక స్క్రిప్టెడ్ వీడియోలోవి

0

రోడ్డుపై గ్యాస్ సిలిండర్ మోసుకెల్లడానికి ఇబ్బంది పడుతున్న ఒక ముస్లిం మహిళకు, మాల ధరించి వున్న ఒక హిందూ సాధువు సహాయం చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. అన్ని మతాలను గౌరవించి, ప్రజలు ఐక్యమత్తంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడమే భారతదేశం యొక్క అసలైన స్వభావం అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. దేశంలో హిజాబ్ వివాదానికి సంబంధించి ప్రస్తుతం హిందూ-ముస్లింల మధ్య పెరుగుతున్న అసహనాన్ని ఉద్దేశిస్తూ, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: రోడ్డుపై గ్యాస్ సిలిండర్ మోసుకెల్లడానికి ఇబ్బంది పడుతున్న ఒక ముస్లిం మహిళకు ఒక హిందూ సాధువు సహాయం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. టాలీవుడ్ నటి హంస నందిని ఈ వీడియోని 03 ఫిబ్రవరి 2020 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది స్క్రిప్టెడ్ లేదా పేరడీ డ్రామా దృశ్యాలని, ఇది కేవలం ప్రజలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో రుపొందించామని హంస నందిని వివరణలో తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియో చివరి కొన్ని క్షణాల సమయంలో, వీడియో కింది భాగంలో ఒక వివరణ కనిపిస్తుండటాన్ని మనం చూడవచ్చు. “ఈ పేజిలో స్క్రిప్టెడ్ లేదా పేరడీ డ్రామా వీడియోలని పబ్లిష్ చేస్తుంది. ఇవి కేవలం ప్రజలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో రుపొందించినవి”, అని ఈ వివరణలో రాసి ఉంది.

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని టాలీవుడ్ నటి హంస నందిని 03 ఫిబ్రవరి 2020 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది స్క్రిప్టెడ్ డ్రామ దృశ్యాలని హంస నందిని తన ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టంగా తెలిపింది. హంస నందిని ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ అయిన మరికొన్ని స్క్రిప్టెడ్ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, నిజజీవితంలో చోటుచేసుకున్న సంఘటన కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, మానవత్వాన్ని వర్ణిస్తూ రూపొందించిన ఇలాంటి కొన్ని స్క్రిప్టెడ్ వీడియోలని సోషల్ మీడియాలో నిజజీవిత సంఘటనలుగా షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ ఆ వీడియోలకి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, గ్యాస్ సిలిండర్ మోసుకెల్లడానికి ఇబ్బంది పడుతున్న ముస్లిం మహిళకు హిందూ సాధువు సహాయం చేస్తున్న ఈ దృశ్యాలు ఒక స్క్రిప్టెడ్ వీడియోలోనివి, నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటన కాదు. 

Share.

About Author

Comments are closed.

scroll