Fake News, Telugu
 

ఇరాన్ నుండి ముడి చమురు కొన్న వివిధ ఆయిల్ కంపెనీలు ఈ చెల్లింపులు చేస్తాయి, భారత ప్రభుత్వం కాదు

0

దేశ చరిత్రలో మొదటిసారి 40 వేల కోట్ల ఇరాన్ అప్పు చెల్లించిన మోడీ సర్కారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత్ లో పెట్రోల్ ధరలు తగ్గించలేదని తిడుతున్న అందరికీ అంకితం…మిగిలిన డబ్బును మనం ఋణపడ్డ ఇరాన్ దేశానికీ అసలు వడ్డీలతో సహా 40 వేల కోట్లు ఈరోజు తీర్చి వేశాం… అప్పుచేసి పప్పుకూడు తిందాం అనే సోమరిపోతు ప్రభుత్వాధినేతలకు…అప్పయినా చేసి ఆడంబరాలు ప్రదర్శించే నాయకులకు చెంపపెట్టు ఇది”, అంటూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి కారణం: మనం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ అసలు వడ్డీలతో సహా 40 వేల కోట్ల రూపాయలను ఈరోజు మోదీ ప్రభుత్వం తీర్చి వేసింది.

ఫాక్ట్: పోస్ట్‌లోని అదే ఫోటో 2016 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతోంది. కాబట్టి, ఇటీవల మోదీ ప్రభుత్వం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ 40 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్టు పోస్ట్‌లో చెప్తున్న విషయంలో వాస్తవం లేదు. అప్పట్లో ముడి చమురుకి సంబంధించి ఇరాన్‌కి 6.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్న మాట వాస్తవమే. అయితే, ఆ చెల్లింపులు చేసేది భారత ప్రభుత్వం కాదు, ఇరాన్ నుండి ముడి చమురు కొన్న వివిధ ఆయిల్ కంపెనీలు. ముడి చమురు దిగుమతిపై ప్రభుత్వాల మధ్య ఎటువంటి నిర్దిష్టమైన ఒప్పందం లేదని, అటువంటి దిగుమతులు కంపెనీల మధ్య ఉండే వాణిజ్య ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయని లోక్ సభలో మంత్రి తెలిపారు. కావున, పోస్ట్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లోని విషయం గురించి వెతకగా, అదే విషయం చెప్తున్న ఫోటో 2016 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ప్రతి సంవత్సరం పెట్రోల్ ధరలపై చర్చ జరిగినప్పుడల్లా అదే ఫోటో షేర్ అవుతోంది. కాబట్టి, ఇటీవల మోదీ ప్రభుత్వం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ 40 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్టు పోస్ట్‌లో చెప్తున్న విషయంలో వాస్తవం లేదు. ఇంతకముందు అలాంటి అప్పు ఏమైనా మోదీ ప్రభుత్వం తీర్చిందో లేదో చూద్దాం.

ఈ విషయంపై ఇంటర్నెట్‌లో వెతకగా, ‘ఇరాన్ చమురు బకాయిల్లో 6.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’, అని చెప్తూ ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారు 2016లో ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చింది. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల వల్ల కొన్ని చెల్లింపులు (6.5 బిలియన్ డాలర్లు – అంటే అప్పటి ఎక్స్‌చేంజ్ రేట్ ప్రకారం సుమారు 43 వేల కోట్ల రూపాయలు) ఆగిపోయిన మాట వాస్తవమే.

ఫిబ్రవరి 2013 నుండి ‘ఎస్సార్ ఆయిల్’ మరియు ‘మంగళూరు రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ (MRPL)’ వంటి భారతీయ రిఫైనరీలు ఇరాన్ నుండి ముడి చమురును కొనుగోలు చేసినందుకు చెల్లించాల్సిన 45 శాతం చెల్లింపును కోల్‌కతాలోని యుకో బ్యాంక్ ద్వారా రూపాయలలో చేస్తున్నారని, మిగిలిన చెల్లింపులు పేరుకుపోవడంతో ఆ చెల్లింపులు ఎలా చేయాలో నిర్ణయించాల్సి ఉందని 2015లో ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారు ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. ‘ఎస్సార్ ఆయిల్’ ఇరాన్‌కు 3.34 బిలియన్ డాలర్లు, ‘MRPL’ 2.49 బిలియన్ డాలర్లు, మరియు ‘IOC’ 581 మిలియన్ డాలర్లు బకాయిపడిందని, ‘HPCL-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (HMEL)’ 97 మిలియన్ డాలర్లు మరియు ‘హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)’ మరో 29 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని ఆ అర్టికల్‌లో చదవచ్చు. మరిన్ని వివరాలను ‘డీఎన్ఏ’ అర్టికల్‌లో కూడా చూడవచ్చు.

అయితే, ఆ చెల్లింపులు చేసేది భారత ప్రభుత్వం కాదు, ఇరాన్ నుండి ముడి చమురు కొన్న వివిధ ఆయిల్ కంపెనీలు. 2019లో కూడా కొన్ని ఆంక్షల తరువాత భారతీయ రిఫైనరీలు ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న చమురుకు రూపాయల్లో చెల్లించారని ‘రాయిటర్స్’ ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. కాబట్టి, అది భారత ప్రభుత్వం చేసిన లేదా తీర్చిన అప్పు కాదు. తాము కొన్న ముడి చమురుకు ఆయిల్ కంపెనీలు చేసే చెల్లింపులు. ఆంక్షల వల్ల చెల్లింపులు సరిగ్గా జరగపోవడంతో ఆ బకాయిలు ఏర్పడ్డాయి. 

ముడి చమురు దిగుమతిపై భారత మరియు ఇరాన్ ప్రభుత్వాలకు మధ్య ఏమైనా ఒప్పందం ఉందా అని లోక్ సభలో అడగగా, ఆ ప్రశ్నకి మంత్రి బదులిస్తూ – “ముడి చమురు దిగుమతిపై ప్రభుత్వాల మధ్య ఎటువంటి నిర్దిష్టమైన ఒప్పందం లేదు. అటువంటి దిగుమతులు కంపెనీల మధ్య ఉండే వాణిజ్య ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయి”, అని సమాధానమిచ్చినట్టు ఇక్కడ చదవచ్చు. ముడి చమురు దిగుమతికి సంబంధించిన ఇతర వివరాలను ఇక్కడ చూడవచ్చు. కాబట్టి, ఇరాన్ ముడి చమురు అప్పును ప్రభుత్వం తీర్చిందని చెప్పడం సరికాదు.

చివరగా, పోస్టులో చెప్పిన వేల కోట్ల చెల్లింపులు చేసేది భారత ప్రభుత్వం కాదు, ఇరాన్ నుండి ముడి చమురు కొన్న వివిధ ఆయిల్ కంపెనీలు.

Share.

About Author

Comments are closed.

scroll