Fact Check, Fake News, Telugu
 

యూపీఎస్సీ సివిల్స్ అర్హత ప్రమాణాలలో మతం ఆధారంగా వేరు వేరు పరిమితులు లేవు

0

యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్) వారు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర పోస్టులకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షను హిందువులు ఆరు సార్లు మాత్రమే రాయవచ్చని, కానీ ముస్లింలకు మాత్రం తొమ్మిది సార్లు రాసే అవకాశం ఉందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, హిందువులు 32 సంవత్సరాల వయసు వరకే పరీక్ష రాయవచ్చని, కానీ ముస్లింలకు 35 సంవత్సరాల వరకు పరీక్ష రాసే అవకాశం ఉందని పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను హిందువులు ఆరు సార్లు మాత్రమే 32 సంవత్సరాల వయసు వరకు రాయవచ్చు. కానీ, ముస్లింలు మాత్రం తొమ్మిది సార్లు 35 సంవత్సరాల వరకు రాసే అవకాశం ఉంది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష అర్హత ప్రమాణాలలో హిందూ మరియు ముస్లింలకు వేరు వేరు పరిమితులు లేవు. అసలు మత పరంగా ఎలాంటి తేడాలు లేవు. కానీ, కులాల ఆధారంగా మాత్రం వివిధ అర్హత పరిమితులు ఉన్నాయి.కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష 2020 నోటిఫికేషన్ లో వెతకగా, అర్హతలలో హిందూ మరియు ముస్లింలకు వేరు వేరు పరిమితులు ఉన్నట్టు ఎక్కడా లేదు. అసలు అర్హత ప్రమాణాలలో మత ప్రస్తావనే లేదు. కానీ, కులాల ఆధారంగా మాత్రం వివిధ పరిమితులు ఉన్నాయి. అంతేకాదు, వేరే ఇతర మినహాయింపులు కూడా ఉన్నాయి, కానీ మత పరమైన మినహాయింపులు మాత్రం లేవు.

కులాల వారీగా వయసు, ప్రయత్నాల పరిమితులను కింద టేబుల్ లో చూడవొచ్చు.

అయితే, ఓబీసీ లిస్టులో ముస్లింలకు సంబంధించిన కొన్ని గ్రూపులు ఉన్నాయి. కావున, ఓబీసీ లిస్టులో ఉన్న ముస్లింలకు మరియు హిందువులకు ఇద్దరికీ తొమ్మిది సార్లు 35 సంవత్సరాల వరకు పరీక్ష రాసే అవకాశం ఉంది; కేవలం ముస్లింలకు కాదు. కేంద్ర ఓబీసీ లిస్టులో తెలంగాణ కు సంబంధించి ఉన్న ముస్లిం గ్రూప్ లను కింద చూడవొచ్చు.

పోస్ట్ లోని ఫోటోని పెట్టి సుదర్శన్ న్యూస్ వారు ప్రసారించిన వార్తని వారి యూట్యూబ్ ఛానల్ లో చూడవొచ్చు. దాంట్లో కూడా రిజర్వేషన్ తీసుకున్న ముస్లింలకు 35 సంవత్సరాల వయసు పరిమితి మరియు 9 అవకాశాలు అని చెప్పినట్టు చూడవొచ్చు. 

చివరగా, యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష అర్హత ప్రమాణాలలో హిందూ మరియు ముస్లింలకు వేరు వేరు పరిమితులు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll