Fake News, Telugu
 

ఇస్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారత ప్రభుత్వం గత కొన్ని నెలలుగా జీతాలు అందజేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు

0

వివరణ (21 సెప్టెంబర్ 2023): చంద్రయాన్-3 యొక్క ముఖ్యమైన భాగాలను సరఫరా చేసిన హెవీ ఇంజనీరింగ్  కార్పొరేషన్ (HEC) ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీతాలు అందలేదనే వార్త వైరల్ అవ్వడంతో, PIB ఫాక్ట్-చెక్ వారు స్పందిస్తూ, HEC గతంలో ఇస్రోకి కీలక భాగాలను సరఫరా చేసిందని, కానీ చంద్రయాన్-3 కోసం ఎటువంటి భాగాలను సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. అలాగే, ఈ సంస్థ గత కొంత కాలంగా నష్టాలలో ఉండడం వల్ల కార్మికులకు, ఆఫీసర్లకు 14-18 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో 11 ఆగస్టు 2023న జవాబిచ్చింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో (ఇస్రో) పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. చంద్రయాన్-3 ప్రయోగం కోసం కావలిసిన 615 కోట్లను కేరళలోని రెండు కంపెనీలు ఖర్చుపెట్టాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఏడాదిన్నర పాటు జీతాలివ్వకపోయినా ఏ అడ్డంకులు లేకుండా ల్యాండ్ అయ్యే మిషన్‌ను తయారుచేసిన ఇంజనీర్లకు తమ అభినందనలంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇస్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.

ఫాక్ట్ (నిజం): ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రతి నెల చివరి తారీఖు నాడు జీతాలు అందుతున్నాయని, ఇస్రో ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. చంద్రయాన్-3 లాంచ్ పాడ్ మరియు ఇతర ముఖ్యమైన భాగాలను తయారుచేసీన హెవి ఇంజనీరింగ్  కార్పొరేషన్ (HEC), తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాదిపైగా నుండి జీతాలు అందజేయడంలేదని పలు వార్తా సంస్థలు 2023 జులై నెలలో రిపోర్ట్ చేశాయి. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇస్రోకు సహకరించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో HEC ఒకటి. చంద్రయాన్-3 ప్రయోగం కోసం కేరళకి చెందిన కంపెనీలు ప్రత్యక్షంగా ఖర్చు చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, చంద్రయాన్-3 లాంచ్ పాడ్ మరియు ఇతర ముఖ్యమైన భాగాలను తయారుచేసీన హెవి ఇంజనీరింగ్  కార్పొరేషన్ (HEC), తమ సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్లకు ఏడాదిపైగా నుండి జీతాలు అందజేయడంలేదని పలు వార్తా సంస్థలు 2023 జులై నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

HEC అనేది భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇస్రోకు సహకరించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో HEC ఒకటి. గత మూడేళ్లుగా ఈ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తున్న కారణంగా తమ ఉద్యోగులకు జీతాలు అందించలేక పోతున్నాయని ఈ రిపోర్టులలో తెలిపారు. HEC సంస్థకు ఇస్రో శాస్త్రవేత్తల జీతాలకు ఎటువంటి సంబంధం ఉండదు. లార్సెన్ & టర్బో (L&T), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ హెవి ఎలెక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) మొదలగు సంస్థలు కూడా చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇస్రోకు సహకరించాయి.

ఇస్రో ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు పొందడం లేదని బిగ్ బాస్ పూర్వపు కంటిస్టంట్ టెహసీన్ పూనావల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 16 ఆగస్టు 2023 నాడు ఒక ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రతి నెల చివరి తారీఖు నాడు జీతాలు అందుతున్నాయని, ఇస్రో ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని PIB తమ  ట్వీట్లో స్పష్టం చేసింది.

PIB ఇస్రో శాస్త్రవేత్తల జీతాలకు సంబంధించి ఇచ్చిన ఈ స్పష్టతను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. చంద్రయాన్-3 ప్రయోగానికి మొత్తంగా 615 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కేరళకు చెందిన 26 ప్రైవేట్ కంపనీలు తయారు చేసిన అనేక ముఖ్యమైన భాగాలను చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఉపయోగించారని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ ఇటీవల పేర్కొన్నారు. కానీ, చంద్రయాన్-3 ప్రయోగం కోసం కేరళకి చెందిన కంపెనీలు ప్రత్యక్షంగా ఖర్చు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

చివరగా, ఇస్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారత ప్రభుత్వం గత కొన్ని నెలలుగా జీతాలు అందజేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll