Fake News, Telugu
 

ఆపిల్ గింజల వల్ల విష ప్రయోగం జరగాలంటే చాలా ఎక్కువ మోతాదులో గింజలను తినవలసి ఉంటుంది

0

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ, ప్రియుడితో కలిసి తన భర్తకు పిండిచేసిన ఆపిల్ విత్తనాలను ఇచ్చి చంపేసింది అని ఒక పోస్టు షేర్ చేయబడుతోంది. అంతే కాకుండా ఆపిల్ విత్తనాలలో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది, వాటిని నమిలినప్పుడు లేదా జీర్ణమైనప్పుడు సైనైడ్ గా మారుతుంది, అది చాలా విషపూరితం, ఇంకా 4-5 మోతాదులలో ప్రాణాంతకం అని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: ఆస్ట్రేలియాలో నివసించే ఒక భారతీయ మహిళ, తన ప్రియుడితో కలిసి తన భర్తకు పిండి చేసిన ఆపిల్ విత్తనాలను ఇచ్చి చంపింది. ఆపిల్ విత్తనాలలో సైనైడ్  విడుదల చేసే అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది.

ఫాక్ట్: కేరళకు చెందిన ఆస్ట్రేలియాలో నివసించే మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తకు సైనైడ్ కలిపిన నారింజ రసం/ఆరంజ్ జ్యూస్ తాగించి చంపింది, ఆపిల్ గింజల పిండి ఇచ్చి కాదు. పోస్టులో చెప్పినట్టు ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది, వాటిని నమిలినప్పుడు లేదా అది  జీర్ణమైనప్పుడు హైడ్రోజన్ సైనైడ్ ను విడుదల చేస్తుంది. కానీ ఈ సైనైడ్ వల్ల విష ప్రయోగం జరిగేందుకు 85 నుండి అనేక వందల పిండిచేసిన గింజలను (ఆపిల్ రకాన్ని బట్టి) తినవలసి ఉంటుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ పోస్టులో చెప్పిన విధంగా ఆస్ట్రేలియాలో నివసించే భారతీయులకు సంబంధించిన హత్య గురించి ఇంటర్నెట్లో వెతకగా, పోస్టులో చెప్పిన సంఘటన గురించి కొన్ని వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). పత్రికలలో ఇచ్చిన సమాచారం ప్రకారం, 2015లో  మెల్బోర్న్ లో నివసిస్తున్న కేరళకు చెందిన సోఫియా, తన ప్రియుడు అరుణ్ కమలాసనన్, సోఫియా భర్త సామ్ అబ్రహంను సైనైడ్ కలిపిన ఆరంజ్ జ్యూస్ తాగించి చంపినట్టు మరియు వారిద్దరికీ 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడినట్టు స్పష్టమయింది. వీరు ఆపిల్ గింజల పిండి ఇచ్చి చంపలేదు.

తరువాత, ఆపిల్ గింజలలో సైనైడ్ ఉంటుందా అని ఇంటర్నెట్లో వెతకగా, కొన్ని ఆర్టికల్స్ ద్వారా (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఆపిల్ పండ్ల గింజలలో అమిగ్డాలిన్ అనే కాంపౌండ్ ఉంటిందని తెలిసింది. ఈ గింజలు జీర్ణ రసాయనాలను విరోధించే బలమైన బయటి పొరను కలిగి ఉంటాయి. వీటిని నమిలితే అమిగ్డలీన్ శరీరంలో విడుదలై జీర్ణ ఎంజైమ్లతో సంబంధంలోకి వచ్చినప్పుడు సైనైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. కానీ శరీరంలో ఎంజైమ్ల ద్వారా చిన్న మొత్తాలను డీటాక్సిఫై చేయవచ్చు.

ఎంత మోతాదులో తీసుకుంటే సైనైడ్ ప్రాణాంతకం అని వెతకగా, 1-2 mg మోతాదు సైనైడ్ ప్రాంణాంతకం అని, ఆ మోతాదులో ఒక శరీరంలోకి ఆపిల్ విత్తనాల ద్వారా సైనైడ్ వెళ్లాలంటే ఆపిల్ రకాన్ని బట్టి కనీసం 85 లేదా 200 (ఆపిల్ రకాన్ని బట్టి) పైగా ఆపిల్ విత్తనాలు నమలాల్సి ఉంటుంది అని తెలిసింది.

చివరగా, ఆస్ట్రేలియాలో నివసించే భారతీయ మహిళ, ప్రియుడితో కలిసి నారింజ రసంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపింది. ఆపిల్ గింజల వల్ల విష ప్రయోగం జరగాలంటే చాలా ఎక్కువ మోతాదులో గింజలను తినవలసి ఉంటుంది.

Share.

About Author

Comments are closed.

scroll