Fake News, Telugu
 

చంద్రునిపై ప్రగ్యాన్ రోవర్ యొక్క టైరు గుర్తులను చూపించే అసలైన ఫోటో ఇది కాదు

0

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 23 ఆగస్టు 2023న చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ అయిన విక్రమ్ ల్యాండర్‌ని చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రగ్యాన్ రోవర్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు టైర్ల ముద్రల మధ్య ఉన్న భారత జాతీయ చిహ్నం మరియు ఇస్రో లోగో యొక్క ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై సంచరించినప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్లుగా అక్కడ గుర్తులు పడ్డాయని చెప్తూ ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ప్రగ్యాన్ రోవర్ చంద్రునిపై సంచరించినప్పుడు ఏర్పడిన గుర్తులను చూపించే ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో పూర్తిగా కల్పితమైనది. ప్రగ్యాన్ రోవర్ టైరు గుర్తులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రో ఇంకా విడుదల చేయలేదు. చంద్రుని ఉపరితలంపై ఈ రోవర్ ప్రయాణించేటప్పుడు, టైరు గుర్తులపై వాటికి అదనంగా భారత జాతీయ చిహ్నం మరియు ఇస్రో లోగోలు కూడా అక్కడ ముద్ర పడతాయి. వైరల్ ఫోటోలో ఉన్నట్లుగా టైరు గుర్తుల మధ్యలో ఇవి ఏర్పడవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇస్రో అధికారిక సమాచారం ప్రకారం, ప్రగ్యాన్ రోవర్ వెనుక భాగాన ఉన్న రెండు టైర్లలో ఒక దానిపై భారత జాతీయ చిహ్నం, మరొక దానిపై ఇస్రో లోగో యొక్క అచ్చులను ఏర్పాటు చేశారు. చంద్రుని ఉపరితలంపై ఈ రోవర్ ప్రయాణించేటప్పుడు, టైరు గుర్తులపై వాటికి అదనంగా ఈ చిహ్నాలు కూడా అక్కడ ముద్ర పడతాయి. కానీ వైరల్ ఫొటోలో కనిపించినట్లుగా రెండు టైర్ల గుర్తుల మధ్యలో ఈ చిహ్నాలు ముద్ర పడవు. దీనికి సంబంధించిన దృశ్యాలని ఇస్రో విడుదల చేసిన కల్పిత యానిమేషన్ వీడియోలో చూడవచ్చు.

అయితే ఈ ఆర్టికల్ రాసే సమయానికి, ప్రగ్యాన్ రోవర్ టైరు గుర్తులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రో అధికారికంగా విడుదల చేయలేదు. ఇక వైరల్ ఫోటో విషయానికి వస్తే, ఫోటో క్రింది భాగాన ఉన్న “క్రిషాన్షు గార్గ్”  అనే పేరు ఆధారంగా వెతకగా, అదే పేరుతో ఉన్న ఒక ఇంస్టాగ్రామ్ అకౌంటును కనుగొన్నాము. అయితే ఇది నిజమైన దృశ్యం కాదని, కేవలం కల్పితమైనదని క్రిషాన్షు గార్గ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో స్పష్టం చేశారు. ఇదే విషయమై “ది క్వింట్” మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తాను ఈ చిత్రాన్ని రూపొందించానని పేర్కొన్నాడు.  

అలాగే, 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2కి సంబంధించిన  ప్రగ్యాన్ రోవర్ టైర్లపై కూడా ఇవే చిహ్నాలు కలిగి ఉన్నాయి. ఇదే విధంగా, 2011లో అంగారక గ్రహం పైకి నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ టైర్లపై కూడా సంబంధిత సంస్థ అయిన JPL(Jet Propulsion Laboratory) అనే అర్థం వచ్చేలా మోర్స్ కోడ్ అచ్చుని ఏర్పాటు చేశారు. ఈ తరహా గుర్తులు రోవర్ దిశ నియంత్రణకు మరియు ఇతర సాంకేతిక అవసరాల కోసం ఉపయోగపడతాయి.  

చివరిగా, వైరల్ ఫోటో చంద్రునిపై ప్రగ్యాన్ రోవర్ టైరు గుర్తులను చూపే అసలు చిత్రం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll