Fake News, Telugu
 

ఈ ఫొటోలో ఉన్నది ఒక బీజేపీ కార్యకర్త, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా కాదు

0

లఖింపూర్ ఖేరి లో హింస జరిగిన ఘటనా స్థలంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా చిత్రాలు, అంటూ కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 03 అక్టోబర్ 2021 నాడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి రైతులు చేపట్టిన ఆందోళనలో హింసాత్మక ఘటనలు  చోటుచేసుకున్నాయి. ఆశిష్ మిశ్రా రైతులను కారుతో తొక్కించి చంపేశాడని ఆరోపణలోస్తున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

క్లెయిమ్: లఖింపూర్ ఖేరి ఘటన సమయంలో బీజేపి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా చిత్రాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా అనుచరుడు, లఖింపూర్ ఖేరి లోకల్ బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా కాదు. లఖింపూర్ ఖేరి ఘటనలో ఆశీష్ మిశ్రా పాత్రని, ఘటన సమయంలో అతను అక్కడ ఉన్నాడా లేడా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి గుగూల్‌లో కీ పదాలు ఉపయోగించి వెతికితే, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా యొక్క అనేక ఫోటోలు ఇంటర్నెట్‌లో లభించాయి.   ఇంటర్నెట్‌లో లభించిన ఆశిష్ మిశ్రా ఫోటోలని పోస్టులో షేర్ చేసిన ఫోటోలతో పోల్చి చూసినప్పుడు, పోస్టులో హైలైట్ చేసిన వ్యక్తి ఆశీష్ మిశ్రా కాదని స్పష్టమయ్యింది. కాని, పోస్టులో షేర్ చేసిన ఒక ఫోటోలో, హైలైట్ చేసిన వ్యక్తి పక్కన ఆశీష్ మిశ్రా కూడా కనిపిస్తున్నారు.

పోస్టులో హైలైట్ చేసిన వ్యక్తి యొక్క సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి స్పష్టతనిస్తూ ‘Navabharat Times’ న్యూస్ సంస్థ 05 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ఆశీష్ మిశ్రాగా వైరల్ అవుతున్న ఈ వ్యక్తి,  ఆశీష్ మిశ్రా అనుచరుడు మరియు లఖింపూర్ ఖేరి లోకల్ బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ అని ఆర్టికల్‌లో తెలిపారు. సుమిత్ జైస్వాల్ ఆశీష్ మిశ్రాతో కలిసి దిగిన మరొక ఫోటోని ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.  

లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ఖేరి పోలీసులు ఆశీష్ మిశ్రాతో పాటు మరో 14 మందిపై కేసు ఫైల్ చేసారు. లఖింపూర్ ఖేరి హత్య ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా ముఖ్య నేరస్థుడని FIRలో ఆరోపిచినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రైతులపై దుసుకెళ్ళిన ‘SUV’ కారు తనదే కానీ, ఆ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని ఆశీష్ మిశ్రా మీడియాతో తెలిపారు. లఖింపూర్ ఖేరి ఘటనలో ఆశీష్ మిశ్రా పాత్రని, ఘటన సమయంలో అతను అక్కడ ఉన్నాడా లేడా అన్న విషయాన్నీ పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు.

చివరగా, లఖింపూర్ ఖేరి బీజేపీ కార్యకర్త ఫోటోలని లఖింపూర్ ఖేరి హింసా ఘటన స్థలంలో ఆశీష్ మిశ్రా చిత్రాలంటూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll