Fake News, Telugu
 

మహిళలు కోలాటం ఆడుతున్న పాత వీడియోని ఎడిట్ చేసి వివిధ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాట పాడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

బతుకమ్మ పాటల రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మరియు తెలంగాణా లోని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పాటలు పాడుతూ, కోలాటం ఆడుతున్న వీడియోలు కొన్ని (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఆ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బతుకమ్మ పాటల రూపంలో  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణా లోని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పాటలు పాడుతూ, కోలాటం ఆడుతున్న వీడియోలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2019 నుండే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఉప్పెరపల్లి గ్రామంలో కోలాటం ఆడుతున్న వీడియో అనే వివరణతో దీనిని అప్లోడ్ చేసారు. ఐతే ఈ వీడియోలో పాట మాత్రం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదు. ‘డోలు డోలు డోలు’ అనే పాటకు మహిళలు కోలాటం ఆడుతున్నట్టు ఉంటుంది. కావున పోస్టులో షేర్ చేసిన వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. వీటి ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తెరాస (కేసీఆర్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా:

బీజేపీకి చెందిన వారు తెరాస (కేసీఆర్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు అంశాలపై బతుకమ్మ పాట రూపంలో మహిళలు పాడుతూ కోలాటం ఆడుతున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ట్రెండ్ మొదలైంది.

బీజేపీ ప్రభుత్వానికి / ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా:

ఎలాగైతే తెరాస (కేసీఆర్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియో రూపొందించారో, అదేవిధంగా అదే వీడియోకి బీజేపీ ప్రభుత్వానికి / ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా పలు అంశాలపై బతుకమ్మ పాట రూపంలో ఒక పాటని డిజిటల్‌గా జోడించి తెరాసకి చెందిన వారు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఐతే నిజానికి మహిళలు కోలాటం చేస్తున్న ఈ వీడియో ఈ వీడియో ఇప్పటిది కాదు, 2019 నుండే ఈ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఉప్పెరపల్లి గ్రామంలో కోలాటం ఆడుతున్న వీడియో అంటూ దీనిని అప్లోడ్ చేసారు. ఐతే ఈ వీడియోలో పాట మాత్రం వేరు, ‘డోలు డోలు డోలు’ అనే పాటకు మహిళలు కోలాటం ఆడుతున్నట్టు ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఐతే ఈ వీడియో ఎప్పటిదో, ఎక్కడ తీసిందో మాకు కచ్చితమైన సమాచారం దొరకలేదు. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు.

వివిధ పార్టీలకు వ్యతికరేఖంగా ఇలాంటివే ఇంకొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐతే ఈ వీడియోలు ఎప్పటివో , ఎక్కడివో తెలియనప్పటికీ, ఈ వీడియోలకి కూడా పాటలను డిజిటల్‌గా జోడించినట్టు అర్ధమవుతుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మీడియా కూడా ఈ వీడియోలను రిపోర్ట్ చేసింది.

చివరగా, మహిళలు కోలాటం ఆడుతున్న పాత వీడియోని ఎడిట్ చేసి వివిధ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాట పాడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll