Fake News, Telugu
 

నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందించే ఎటువంటి పథకం లేదు

0

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని విజయవంతం చేయడం కోసం నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందిస్తున్నాడని, ఈ మెసేజ్ ని కేవలం మూడు గ్రూపుల్లో షేర్ చేస్తే ఆటోమేటిక్ గా మొబైల్ రీఛార్జి అయిపోతుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని విజయవంతం చేయడం కోసం నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం పేరుతో రూ.400 ఉచిత రీఛార్జి అందిచే ఎటువంటి పథకం లేదు. ఈ వార్త చాలా సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇలాంటి ఫేక్ మెసేజిల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపే చాలా వార్తా కథనాలు ఉన్నాయి. దీన్నిబట్టి ఇది ఒక ఫేక్ మెసేజ్ అని అర్ధంచేసుకోవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందించే ఎటువంటి ప్రభుత్వ పథకం లేదు. ఇలాంటి ఒక పథకం ఉందని తెలిపే వార్తా కథనం గాని లేక ప్రభుత్వ సమాచారం గాని మాకు లభించలేదు.

ఇదే వార్త చాలా రోజుల ముందు నుండే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ వార్తని షేర్ చేసిన కొన్ని పాత పోస్టులు ఇక్కడ చూడొచ్చు. 2016లో కూడా ఈ వార్త వైరల్ అయ్యింది. ఒక లింక్ ని షేర్ చేసి నరేంద్ర మోదీ రూ. 500 ఫ్రీ రీఛార్జి అందిస్తున్నాడని, ఇది పొందాడానికి ఈ లింక్ ద్వారా తమ సమాచారం అందించాలని చెప్పే ఒక వాట్సాప్ మెసేజ్ 2017లో భాగా వైరల్ అయ్యింది, ఐతే ఇది ఒక ఫేక్ మెసేజ్ అని, ఈ లింక్ ద్వారా బ్యాంకు వివరాలు అందించడం వల్ల సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఎకౌంటులోని డబ్బుని దొంగలిస్తున్నారని తెలుపుతూ ఇండియా టుడే ఒక వార్తా కథనం కూడా రాసింది. మోదీ ఫ్రీ స్కీమ్స్ పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించిన కథనం ఇక్కడ చూడొచ్చు.

గతంలో కూడా ఇలాగే ఫ్రీ ల్యాప్‌టాప్, ఫ్రీ స్కూటీ మొదలైన కొన్ని ఫ్రీ స్కీంల గురించిన వార్తలను వైరల్ అయినప్పుడు వాటిని  డీబంక్ చేస్తూ FACTLY రాసిన కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందించే ఎటువంటి పథకం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll