కోవిడ్-19 ద్వారా మృతి చెందితే కూడా ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ మరియు ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకాలలో మృతుల కుటుంబాలు రెండు లక్షల రూపాయలు పొందవచ్చని చెప్తూ ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ మరియు ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకాలలో కోవిడ్-19 మృతుల కుంటుంబాలకు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తారు.
ఫాక్ట్ (నిజం): కోవిడ్-19 మరణాలకు కూడా ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ పథకం వర్తిస్తుందనేది నిజమే, కానీ కొన్ని అర్హత పరిమితులు, భీమా క్లెయిమ్ ఎలా చేయాలి అనే షరతులు ఉన్నాయి. ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకం ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకంలో కోవిడ్-19 సంబంధిత మృతులను చేర్చుతూ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని FACTLY తో అధికారులు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది కొంతవరకు నిజం.
పోస్ట్ లోని మెసేజ్ లో రెండు ప్రభుత్వ పథకాల పేర్లు ఉన్నాయి. ఆ పథకాలు కోవిడ్-19 మరణాలకు వర్తిస్తాయో లేదో ఒక్కోటి చూద్దాం.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన:
కోవిడ్-19 మరణాలకు ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ పథకం వర్తిస్తుందా?
‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ పథకం కోవిడ్-19 మరణాలకు కూడా వర్తిస్తుంది. ‘జన్-ధన్ సే జన్ సురక్ష’ వెబ్సైటులో ఉన్న ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ రూల్స్ లో ఆ భీమా పథకం అన్నీ రకాల మరణాలకు వర్తిస్తుంది అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. జీవిత భీమా కోవిడ్-19 మరణాలకు కూడా వర్తిస్తుంది అని ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)’ వారు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో చదవొచ్చు. ‘Force Majeure’ అనే క్లాజు కోవిడ్-19 మరణాల క్లెయిమ్స్ కి వర్తించదు అని, అన్నీ భీమా కంపెనీలు కోవిడ్-19 మరణాలకు కూడా జీవిత భీమా డబ్బులు ఇవ్వాలని ‘లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ వారు తెలిపినట్టు ఇక్కడ చూడవొచ్చు.
కానీ, ఈ పథకం అన్ని వయసుల వారికి వర్తించదు. కేవలం, 18-50 సంవత్సరాల మధ్య వయసు గల వారు బ్యాంకు ఖాతా ఉండి, ప్రతి సంవత్సరం వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. అలాగే, 55 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత భీమా ముగుస్తుంది (50 ఏళ్ళ వరకు లేదా అంతకు ముందే చేరి, ఏటా ప్రీమియం చెల్లించినట్లయితే 55 ఏళ్ళ వారకు భీమా వర్తిస్తుంది). భీమా తీసుకున్న వారు దురదృష్టకర సంఘటనలో మరణించితే, మరణ ధృవీకరణ పత్రంతో పాటు నిర్దేశించిన దావా ఫారం నింపి, ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో ‘మరణించిన 30 రోజుల్లోపు’ (తప్పనిసరి కాదు) దాఖలు చేయాలి.
కావున, కోవిడ్-19 మరణాలకు కూడా ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ పథకం వర్తిస్తుంది. కానీ, కొన్ని అర్హత పరిమితులు, భీమా క్లెయిమ్ ఎలా చేయాలి అనే షరతులు ఉన్నాయి.
ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన:
కోవిడ్-19 మరణాలకు ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకం వర్తిస్తుందా?
‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకం కోవిడ్-19 మరణాలకు వర్తించదు. ఆ పథకం కి సంబంధించిన రూల్స్ లో అది ఒక ప్రమాద భీమా పథకం అని, ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం పొందిన వారు భీమా డబ్బులు పొందవచ్చని రాసి ఉన్నట్టు చదవొచ్చు. ఆ పథకం కి సంబంధించి ‘ఫ్యూచర్ జనరాలి’ వారి వెబ్సైటులో ఉన్న డాక్యుమెంట్ లో కూడా, ‘ప్రమాదం వల్ల ఏదైనా శారీరక గాయం కలిగితే, అప్పుడు కంపెనీ ఆ వ్యక్తికి భీమా డబ్బులు చెల్లించాలి’, అని రాసి ఉంది. ‘IRDAI’ రిలీజ్ చేసిన ఒక డాక్యుమెంట్ లో ప్రమాదం యొక్క నిర్వచనం (‘Accident or Accidental means a sudden, unintended and fortuitous external and visible event’) చదవొచ్చు. కావున, కోవిడ్-19 మరియు ఇతర వ్యాధులకు ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకం వర్తించదు.
అంతేకాదు, ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ టోల్-ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి అధికారులతో FACTLY మాట్లాడగా, వారు కూడా ‘ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన’ పథకం ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని, ఈ పథకంలో కోవిడ్-19 సంబంధిత మృతులను చేర్చాలని ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు తెలిపారు.
చివరగా, కోవిడ్-19 మరణాలకు ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ వర్తిస్తుంది; ‘సురక్షా భీమా యోజన’ వర్తించదు.