Fake News, Telugu
 

ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న కట్టడం ఒక ఇస్కాన్ మందిరం, మసీదు కాదు

0

Update (06 June 2023):

బహనాగ స్టేషన్ మేనేజర్ అయిన RSS కార్యకర్త ఎల్.బీ. శర్మ అనే వ్యక్తి ప్రమాదం జరిగిన తర్వాత నుండి కనిపించటంలేదని, అతని కోసం మూడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని మరొక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

అయితే ఇండియా టుడే ప్రచురించిన స్టేషన్ సిబ్బంది వివరాల ప్రకారం ఎల్.బీ. శర్మ  అనే పేరుతో బహనాగ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ లేరు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్. బీ. మహంతి స్టేషన్ ఇన్-చార్జుగా వ్యవహరిస్తున్నారు. మహంతిని ప్రస్తుతం రైల్వే సేఫ్టీ కమిషనర్ బృందం విచారిస్తుందని స్టేషన్ మేనేజర్ ఎస్. కె. పట్నాయక్ పేర్కొన్నారు.

Update (05 June 2023):

తాజా వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), ప్రమాదం జరిగిన సమయంలో బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌కు ఇన్-చార్జు స్టేషన్ మాస్టర్ గా ఉన్న ఎస్.బి. మహంతిని ప్రస్తుతం రైల్వే సేఫ్టీ కమిషనర్ బృందం విచారిస్తోందని మరొక స్టేషన్ మాస్టర్ ఎస్. కె. పట్నాయక్ పేర్కొన్నారు (ఒక రైల్వే స్టేషన్‌కు షిఫ్ట్‌ల వారీగా స్టేషన్ మాస్టర్లు విధులలో ఉంటారు). ప్రమాదం జరిగాక బాలాసోర్ GRPSలో దాఖలైన FIRలో షరీఫ్ అనే వ్యక్తి కానీ ఇంకెవరు కానీ పరారీలో ఉన్నట్లు నమోదు కాలేదు. ఇదే విషయాన్ని బాలాసోర్ GRPS ఎస్.ఐ. పప్పు కుమార్ నాయక్ మాకు ధృవీకరించారు. షరీఫ్ అనే పేరుగల స్టేషన్ మాస్టర్ పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.

Published (04 June 2023):

ఒడిశాలోని బాలాసోర్ నగరం సమీపంలో 02 జూన్ 2023న ఘోర రైలు ప్రమాదం జరిగి దాదాపు 288 మంది మృతి చెందిన నేపథ్యంలో, ప్రమాదానికి కారణమైన షరీఫ్ అనే పేరు గల స్టేషన్ మాస్టర్ పరారీలో ఉన్నాడని, అలాగే ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉందనే అర్థం వచ్చేలా చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన స్టేషన్ మాస్టర్ షరీఫ్ అనే స్టేషన్ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉంది.

ఫాక్ట్: స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బహనాగ బజార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పరారయ్యాడు. అతని పేరు ఎస్. బి. మహంతి’. ఇంకా ఘటనా స్థలంలో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న కట్టడం మసీదు కాదు, అది ఇస్కాన్ మందిరం. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

రైల్వే శాఖ అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ సిగ్నల్ వ్యవస్థలో లోపం లేదా మానవ తప్పిదం వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బహనాగ బజార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ‘ఎస్. బి. మహంతి’ ప్రమాదం జరిగిన తర్వాత పరారయ్యాడు. దీనికి సంబంధించి బాలాసోర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కేసు తీవ్రత దృష్ట్యా, FIR ను ఇంకా పోలీస్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచలేదు)

ఇక ఘటనా స్థలంలో ఉన్న కట్టడం విషయానికొస్తే, పలు వార్తా ఛానెల్లలో ప్రసారం చేసిన దృశ్యాలను (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) పరిశీలించగా, ఆ ప్రదేశంలో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న కట్టడం ఒక గుడి అని తెలుస్తుంది.

ఈ దృశ్యాల ఆధారంగా గూగుల్ ఎర్త్ మరియు మ్యాప్స్ సహాయంతో, అది బహనాగ  ఇస్కాన్ దేవాలయం అది గుర్తించాం.

స్థానిక పాత్రికేయులు బూమ్ లైవ్ మరియు ఆల్ట్ న్యూస్‌కి ఇచ్చిన బహనాగ ఇస్కాన్ మందిరం ఫొటోలను కింద చూడవచ్చు.

పై ఆధారాలను బట్టి ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కట్టడం బహనాగ ఇస్కాన్ మందిరం అని కచ్చితంగా చెప్పవచ్చు.

చివరిగా, ఒడిశా రైలు ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న బహనాగ స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పేరు షరీఫ్ కాదు, ఎస్. బీ. మహంతి. ఇంకా ఘటనా స్థలంలో ఉన్న కట్టడం మసీదు కాదు, అది ఒక ఇస్కాన్ మందిరం.

Share.

About Author

Comments are closed.

scroll