బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శ్రీ రామ నవమి యాత్రకి సంబంధించిన దృశ్యాలంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇదే వీడియోని మరికొందరు హనుమాన్ శోభ యాత్ర చెందినదని కూడా ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 2023 హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామ నవమి యాత్రకి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు 12 మార్చి 2023 న ఇండోర్‌లో జరిగిన రంగ్ పంచమి వేడుకలకు చెందినవి. హైదరాబాద్లో జరిగిన హనుమాన్, రామ నవమి శోభా యాత్రలకు చెందినవి కావు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని రామ నవమి యాత్రకు దాదాపు 20 రోజుల ముందే 12 మార్చి 2023న యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ లలో అనేక మంది యూసర్లు అప్‌లోడు చేసినట్లు గుర్తించాము. అయితే ఈ వీడియోని దృశ్యాలు 12 మార్చి 2023న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో నిర్వహించిన రంగ్ పంచమి ర్యాలీకి చెందినవిగా పేర్కొన్నారు.
వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ ర్యాలీకి సంబంధించి వివిధ వార్తా ఛానెళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేసిన దృశ్యాలతో పోల్చగా, ఈ వీడియో ఇండోర్ లో జరిగిన రంగ్ పంచమి వేడుకలకు చెందినదిగా నిర్ధారించవచ్చు. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
మీడియా కథనాల ప్రకారం, ఇండోర్‌లోని రజ్వాడ ప్రాంతంలో రంగ్ పంచమి సందర్భంగా ప్రతిఏటా ఈ వేడుకలను నిర్వహిస్తారు. 2022లో కూడా ఇదే ప్రాంతంలో జరిగిన రంగ్ పంచమి వేడుకల దృశ్యాలను మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఇతర అధికారులు కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలలో కూడా వైరల్ వీడియోలో ఉన్న పెద్ద భవనాన్ని చూడవచ్చు.
ఇక హైదరాబాద్‌లో రాజా సింగ్ పాల్గొన్న రామ నవమి శోభా యాత్ర దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇండోర్‌లో జరిగిన రంగ్ పంచమి వేడుకలకు చెందినవి. హైదరాబాద్లో జరిగిన హనుమాన్, రామ నవమి శోభా యాత్రలకు చెందినవి కావు.