Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులపై ఉమ్మి వేస్తున్న మహిళ ‘తీస్తా సెతల్వాద్’ కాదు; ఈమె కాంగ్రెస్ పార్టీ నేత ‘నెట్టా డిసౌజ’

0

తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల పై ఉమ్ముతున్న ఈ మహిళ ‘తీస్తా సెతల్వాద్’ అని ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తీస్తా సెతల్వాద్ తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై ఉమ్మి వేసింది.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్న మహిళ ‘అఖిల భారత మహిళా కాంగ్రెస్’ తాత్కాలిక అధ్యక్షురాలు “నెట్టా డిసౌజ”. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న ఆరోపణ తప్పు.

వీడియోలో జరిగిన ఘటన గురించి ఇంటర్నెట్ లో వెతుకగా, ఇదివరకే  మీడియా ప్రచురించిన కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 21 జూన్ 2022న ఢిల్లీలో జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా రాహుల్ గాంధీని ప్రశ్నించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుకు వ్యతిరేకంగా నెట్టా డిసౌజాతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడ ఉన్న ఆందోళన కారులని అరెస్ట్ చేసి బస్సులో తరలిస్తున్న సమయంలో నెట్టా డిసౌజ వారి పైన ఉమ్మి వేసి, దాడి చేసింది.

తీస్తా సెతల్వాద్ గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదికి వ్యతిరేకంగా ఫోర్జరీకి పాల్పడి, సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై గుజరాత్ పోలీసులు ఆమెను 25 జూన్ 2022న అదుపులోకి తీసుకున్నారు.

తీస్తా సెతల్వాద్ అరెస్టుకు సంబంధించిన వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలలో తాను పోలీసులపై ఉమ్మి వేస్తున్నట్టు ఎక్కడా లేదు.

చివరిగా, వైరల్ అవుతున్న వీడియోలో పోలీసులపై ఉమ్మి వేస్తున్న మహిళ కాంగ్రెస్ పార్టీ నేత ‘నెట్టా డిసౌజ’; తీస్తా సెతల్వాద్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll