Fake News, Telugu
 

బాల్య వివాహాలు చేసుకోండి కానీ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోండని అంటున్న చట్టానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని తప్పుదోవ పట్టిస్తున్నారు

0

బాల్యవివాహాలు చేసుకోండి కానీ 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటూ చట్టబద్ధానికి కాంగ్రెస్ ఆమోదించింది” అని అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఇటీవల, రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దృష్టిలో పెట్టుకొని, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాల్యవివాహాలు అనుమతించిందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బాల్య వివాహాలు చేసుకోండి కానీ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అంటున్న చట్టానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.

ఫాక్ట్: రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. కానీ, అందులో బాల్య వివాహాలు చేసుకోండని అనుమతి తెలిపినట్టుగా బిల్లులో లేదు. (అన్ని) వివాహాల నమోదు గురించి మాత్రమే చట్టంలో ఉన్నట్టు చూడొచ్చు, బాల్య వివాహానికి అనుమతించారని ఎక్కడా కూడా లేదు. రిజిస్ట్రేషన్ కొరకు మెమోరాండం పొందాక బాల్య వివాహాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ కు రిజిస్ట్రార్స్ ఆఫ్ మ్యారేజ్ రిపోర్ట్ చేస్తారని; వివాహం రిజిస్టర్ అయ్యాక కూడా కలెక్టర్ దానిపై చర్యలు తీసుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం బాల్య వివాహాలు దేశంలో నిషేధించబడ్డాయి. ఈ బిల్లులోని సెక్షన్ 8 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ ఇటీవల దాఖలు చేయబడింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుండి, సామజిక కార్యకర్తల నుండి చాలా వ్యతిరేకత ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, వివిధ మతాలకు చెందిన వ్యక్తులందరి వివాహాలను వారి వారి రాష్ట్రాల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తూ రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఆక్ట్, 2009ను తీసుకొచ్చింది. వివాహాల నమోదు గురించి మాత్రమే చట్టంలో ఉన్నట్టు చూడొచ్చు. దీనిలో బాల్య వివాహానికి అనుమతించారని ఎక్కడా కూడా లేదు. అలాగని, ఒక వివాహం నమోదు కానందున మాత్రమే ఆ వివాహం చెల్లదని భావించబడదు, అని కూడా ఈ ఆక్ట్ యొక్క సెక్షన్ 11లో ఉంది.

బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం బాల్య వివాహాలు దేశంలో నిషేధించబడ్డాయి.

రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. కొత్త సవరణ బిల్లుతో 2009 చట్టంలోని సెక్షన్ 5 మరియు సెక్షన్ 8లను సవరించాలని కోరుతున్నట్టు ‘statement of objects and reasons’లో తెలిపారు.

రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఆక్ట్, 2009 లోని సెక్షన్ 5 జిల్లా వివాహ రిజిస్ట్రేషన్ అధికారి నియామకానికి అవకాశం కల్పిస్తుంది. జిల్లా మరియు బ్లాక్ స్థాయిలో వివాహాల నమోదు పనిని సమీక్షించడానికి అదనపు వివాహ రిజిస్ట్రేషన్ అధికారి మరియు బ్లాక్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమించాలని కొత్త సవరణ బిల్లులో నిర్ణయించారు.

2009 చట్టంలోని సెక్షన్ 8లో అబ్బాయి మరియు అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు పూర్తి కానట్లయితే; తల్లిదండ్రులు లేదా వారి గార్డియన్స్ (Guardian)కి , వివాహం జరిగిన తేదీ నుండి ముప్పై రోజుల వ్యవధిలో మెమొరాండం రిజిస్ట్రార్ కు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, ప్రస్తుత సవరణ బిల్లులో అబ్బాయి 21 ఏండ్లు అమ్మాయి 18 ఏండ్ల వయస్సు పూర్తి కానట్లయితే అలా చేయాలని మార్పు చేసారు. ఈ తేడాను లైవ్ లా వారి ఆర్టికల్‌లో స్పష్టంగా చూపించారు. ఎవరైనా మరణించినట్లయితే వివాహ నమోదు నిబంధనను చేర్చాలని కూడా సవరణ బిల్లులో నిర్ణయించారు.

ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత:

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఈ చట్టాన్ని నిరసించింది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఓట్ల విభజనను డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించనప్పుడు, వారు వాకౌట్ చేశారు.

అయితే, సవరణ బిల్లు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ఉల్లంఘించిందని, చిన్న పిల్లల వివాహానికి మార్గం సుగమం చేస్తుందని ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వివరణ:

బాల్య వివాహాలతో సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన 2009 చట్టంలో ఉందని; సెక్షన్ 8కు సంబంధించిన బాలికల వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు మాత్రమే ఈ సవరణ తగ్గించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

ఈ బిల్లు ప్రస్తుత చట్టానికి “సాంకేతిక మార్పు”ను మాత్రమే చేస్తోందని, బాల్య వివాహాలకు సంబంధించిన బాధితులను చేరుకోవడమే లక్ష్యంగా ఉందని ప్రభుత్వం నాలుగు పేజీల వివరణలో ఉన్నట్టు ఆర్టికల్‌లో చూడొచ్చు.

రిజిస్ట్రేషన్ కొరకు మెమోరాండం పొందాక బాల్య వివాహాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ కు రిజిస్ట్రార్స్ ఆఫ్ మ్యారేజ్ రిపోర్ట్ చేస్తారని తెలిపారు. అంటే వివాహం నమోదు అయ్యాక కూడా కలెక్టర్ దానిపై చర్యలు తీసుకోవచ్చు. 2016లో చట్టం కింద నాలుగు, 2017లో 10, 2018లో 17 బాల్య వివాహాలు నమోదయ్యాయి.

“బాల్య వివాహాల నమోదు వాటిని చట్టబద్ధం చేయడానికి కాదు. మేజర్ అయిన తరువాత అతని లేదా ఆమె వివాహాన్ని రద్దు చేసే హక్కు ప్రతి మైనర్ కు ఉంటుంది,” అని అందులో తెలిపారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ రాజస్థాన్ సభ్యుడు ఘనశ్యామ్ సింగ్ రాథోడ్ ది హిందూతో మాట్లాడుతూ, “ఇది నమోదు చేయబడినప్పటికీ, బాల్య వివాహం నేరంగా కొనసాగుతోంది” అని ఆయన అన్నారు.

సామజిక కార్యకర్తల నుండి వ్యతిరేకత:

బాల్య వివాహాలను కూడా రిజిస్ట్రేషన్లలో చేర్చాలని సుప్రీంకోర్టు తన 2006 నిర్ణయంలో ఎక్కడా ప్రస్తావించలేదని; ఈ సవరణను ముందుకు తీసుకెళ్లడానికే ప్రభుత్వం తన సొంత అర్ధంలేని వ్యాఖ్యానంతో ముందుకు వెళ్ళిందని సామజిక కార్యకర్తల నుండి వ్యతిరేకత వస్తుంది.

ఈ బిల్లు కేవలం ఒక రాజకీయ కారణంతో తీసుకొచ్చారని అంటున్నారు. జతి పంచ్ లను (కమ్యూనిటీ లీడర్ లను) సంతోషపెట్టడానికి, వారు ప్రజల మద్దతును కలిగి ఉంటారని, రాజస్థాన్‌లో ఓట్లను వారు ప్రభావితం చెయ్యగలరు కాబట్టే ఇలా చేసారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ బిల్లులోని సెక్షన్ 8 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ ఇటీవల దాఖలు చేయబడింది.

2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ లో 8.6% బాలలు, 8.3% బాలికల్లో, బాల్య వివాహాలు చోటు చేసుకున్నాయి. బాల్య వివాహాల ఘటనలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ ఆవిర్భవించింది. 2015-16లో సేకరించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 డేటా ప్రకారం, 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికల్లో 16.2% మంది రాష్ట్రంలో 18 సంవత్సరాల కంటే ముందే వివాహం చేసుకున్నారు.

చివరగా, బాల్య వివాహాలు చేసుకోండి కానీ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోండని అంటున్న చట్టానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll