Fake News, Telugu
 

నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక “LAST, BEST HOPE OF EARTH” అని వ్యాఖ్యానించిందన్న న్యూస్ క్లిప్ ఫేక్

0

ప్రముఖ అమెరికన్ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ 26 సెప్టెంబర్ 2021న ప్రచురించిన ఎడిషన్‌లో మొదటి పేజీలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ “LAST, BEST HOPE OF EARTH” అని కోట్ చేసిందని చెప్తూ, ఆ న్యూస్ క్లిప్‌ని షేర్ చేసిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక 26 సెప్టెంబర్ 2021న ప్రచురించిన ఎడిషన్‌ మొదటి పేజీలో మోదీని ఉద్దేశిస్తూ “LAST, BEST HOPE OF EARTH” అని కోట్ చేసిన క్లిప్.

ఫాక్ట్ (నిజం): న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక 26 సెప్టెంబర్ 2021న ప్రచురించిన ఎడిషన్‌ మొదటి పేజీలో మోదీకి సంబంధించి ఎటువంటి కథనం రాయలేదు. ఈ క్లిప్ డిజిటల్‌గా తయారు చేసింది. ఈ క్లిప్‌లో తేదీ, పేపర్ ధర, ఎడిషన్ యొక్క వాల్యూమ్, మొదలైన వివరాలు తప్పు. పైగా ఈ క్లిప్‌లో ఉన్న అక్షరాల ఫాంట్‌కి ఒరిజినల్ క్లిప్‌లోని ఫాంట్‌కి చాలా వ్యత్యాసం ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక 26 సెప్టెంబర్ 2021న ప్రచురించిన ఎడిషన్‌ మొదటి పేజీలో మోదీకి సంబంధించి ఎటువంటి కథనం రాయలేదు. వైరల్ అవుతున్న న్యూయార్క్ టైమ్స్ క్లిప్ డిజిటల్‌గా తయారు చేసారు. వైరల్ న్యూస్ క్లిప్‌ని, 26 సెప్టెంబర్ 2021న న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒరిజినల్ క్లిప్‌తో పోల్చి చూసినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. వైరల్ అవుతున్న క్లిప్‌లో తేదీకి సంబంధించిన వివరాలలో సెప్టెంబర్ స్పెల్లింగ్ తప్పుగా ఉంది, పేపర్ ధర, ఎడిషన్ యొక్క వాల్యూమ్ వివరాలు కూడా తప్పుగా ఉన్నాయి.

ఒరిజినల్ క్లిప్‌లో అక్షరాల ఫాంట్, వైరల్ అవుతున్న క్లిప్‌లోని ఫాంట్‌లో కూడా మనకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఉదాహారణకు పైన ఫోటోలో చూపించినట్టు తేదీకి సంబంధించిన వివరాలలో గాని లేక వైరల్ క్లిప్‌లోని మోదీ ఫోటో కింద ఉన్న వాక్యంలో వాడిన ఫాంట్‌, ఒరిజినల్ క్లిప్‌లో వాడిన ఫాంట్‌కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వివరాల బట్టి వైరల్ అవుతున్న క్లిప్ డిజిటల్‌గా తయారు చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

1 జనవరి 1863న అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, అప్పటి వరకు బానిసలుగా ఉన్న వారిని బానిసత్వం నుండి విముక్తుల్ని చేస్తూ ఈమాన్సిపేషన్ ప్రోక్లమేషన్ జారీ చేసిన సందర్భంలో అమెరికన్ కాంగ్రెస్‌లో ఇచ్చిన సందేశంలో ‘LAST, BEST HOPE OF EARTH’ అనే వ్యాక్యాన్ని వాడారు. దీన్నిబట్టి, వైరల్ అవుతున్న క్లిప్‌లో మోదీని ఉద్దేశిస్తూ న్యూయార్క్ టైమ్స్ రాసిందన్న వ్యాఖ్య లింకన్ స్పీచ్ నుండి సేకరించిందని అర్ధం చేసుకోవచ్చు.

ఇకపొతే వైరల్ క్లిప్‌లో ఉన్న మోదీ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 12 మార్చి 2021న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతకం చేసినప్పటిది అని తెలిసింది.

29 సెప్టెంబర్ 2021 న ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక ట్వీట్ ద్వారా పోస్ట్‌లో షేర్ చేయబడిన ఫోటో పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది.

చివరగా, మోదీని ఉద్దేశిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక “LAST, BEST HOPE OF EARTH” అని వ్యాఖ్యానించిందన్న న్యూస్ క్లిప్ ఫేక్, దిన్ని డిజిటల్‌గా తయారు చేసారు.

వివరణ (SEPTEMBER 29, 2021):
ఈ ఆర్టికల్ ‘న్యూయార్క్ టైమ్స్’ వారు స్పష్టతనిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అప్డేట్ చేయటం జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll