Fake News, Telugu
 

ఈ ఫోటోలో కనిపిస్తున్నది కృష్ణకమలంగా పిలవబడే పాసీఫ్లోర ఇన్‌కర్నాట పుష్పం కాదు, ఈ పుష్పం మూడు సంవత్సరాలకు ఒకసారి పూస్తుందనే సమాచారంలో ఎటువంటి నిజం లేదు

0

మూడేళ్లకు ఒకసారి పూచే కృష్ణ కమలం పుష్పం యొక్క చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని బాగా షేర్ చేస్తున్నారు. వయొలెట్ రంగులో ఉన్న ఆకులు 100 మంది కౌరవులని, పచ్చ రంగులో ఉన్న ఆకులు ఐదుగురు పాండవులను, పర్పుల్ రంగులో ఉన్న మూడు ఆకులు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులని అలాగే, మధ్యలో సుదర్శన చక్రాన్ని నివేదిస్తున్నాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మూడేళ్లకు ఒకసారి పూచే కృష్ణ కమలం పుష్పం యొక్క చిత్రం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది పాసీఫ్లోర కరెలియ (బ్లూక్రౌన్ ప్యాషన్ ఫ్లవర్) అనే పాసీఫ్లోర కుటుంబానికి చెందిన పుష్పం. ఈ పుష్పాలు జులై నుండి సెప్టెంబర్ నెలల మధ్యలో, అంటే ఎండాకాలం చివరి నుండి శరదృతువు మధ్య కాలంలో పూస్తుంటాయని తెలిసింది. ఇదే జాతికి చెందిన కృష్ణకమలంగా పిలివబడే పాసీఫ్లోర ఇన్‌కర్నాట పుష్పాలు కూడా ఎండకాలాంలో సాధారణంగా పూస్తుంటాయని తెలిసింది. ఈ పాసీఫ్లోర కుటుంబానికి చెందిన పుష్పాలు మూడేళ్లకు ఒకసారి పూస్తాయని షేర్ చేస్తున్న సమాచారంలో ఎటువంటి నిజం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్నది పాసీఫ్లోర కుటుంబానికి చెందిన పాసీఫ్లోర కరెలియ పుష్పం అని తెలిసింది. ఇదే పుష్పం యొక్క ఫోటోలని షేర్ చేస్తూ నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన అర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. సుమారు 10 సెంటీమేటర్ల వ్యాసం (డయామిటర్) కలిగి ఉన్న పాసీఫ్లోర కరెలియ పుష్పానికి, 5 సెపల్స్ మరియు రేకులు చూడటానికి సమానంగా ఉంటాయని, వాటిపై 5 ఆకుపచ్చ-పసుపు రంగు స్టామెన్లు మరియు 3 పర్పుల్ రంగులలో స్టీగ్మాలు కలిగి ఉంటాయని తెలిసింది.  

బ్లూక్రౌన్ ప్యాషన్ ఫ్లవర్‌గా కూడా పిలవబడే ఈ పాసీఫ్లోర కరెలియ పుష్పం జులై నుండి సెప్టెంబర్ నెలల మధ్యలో, అంటే ఎండాకాలం చివరీ నుండి శరదృతువు కాలంలో మధ్యలో పూస్తుంటాయని పలు సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఉష్ణమండల శీతోష్ణస్థితి (ట్రోపికల్ వాతావరణంలో) ఈ పాసీఫ్లోర కరెలియ సంవత్సరం మొత్తం పూచే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయన సంస్థలు తెలిపాయి. సౌత్ అమెరికా జన్మస్థలమైన ఈ పాసీఫ్లోర కరెలియ పుష్పాలని భారత దేశంతో సహ అనేక దేశాలలో సహజీకరించారు.

యేసుక్రీస్తు శిలువ మరణ బాధని మరియు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్‌ను ఉద్దేశిస్తూ సౌత్ అమెరికాలోని రోమన్ కథోలిక్ ప్రీస్టులు 15-16వ శతాబ్ద కాలంలో ఈ పుష్ప జాతికి పాసీఫ్లోర  అనే పేరు పెట్టినట్టు తెలిసింది. కృష్ణకమలంగా పిలిచే పాసీఫ్లోర ఇన్‌కర్నాట కూడా ఇదే జాతికి చెందిన ఒక పుష్పం. వైల్డ్ ప్యాషన్ ప్లవర్‌ అని కూడా పిలిచే ఈ పాసీఫ్లోర ఇన్‌కర్నాట పుష్పం వెచ్చని వాతావరణ పరిస్థితులలో ఎండాకాలం నుండి శరదృతువు మధ్య కాలంలో పూస్తుంటుందని తెలిసింది. పోస్టులో షేర్ చేసినది కృష్ణకమలం కాదు, పాసీఫ్లోర కరెలియ పుష్పమని, ఈ పుష్పం మూడు సంవత్సరాలకు ఒకసారి పూస్తుందనే వార్తలలో ఎటువంటి నిజం లేదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ ఫోటోలో కనిపిస్తున్నది కృష్ణకమలంగా పిలవబడే పాసీఫ్లోర ఇన్‌కర్నాట పుష్పం కాదు, ఈ పుష్పం మూడు సంవత్సరాలకు ఒకసారి పూస్తుందనే సమాచారంలో ఎటువంటి నిజం లేదు.     

Share.

About Author

Comments are closed.

scroll