Fake News, Telugu
 

ఈ వీడియోలో గోహత్యను అడ్డుకుంటున్నది శ్రీనగర్‌కి చెందిన ఒక ముస్లిం, కశ్మీరీ పండిట్ కాదు

0

జమ్మూ కాశ్మిర్‌లో ఆర్టికల్ 370 హోదా తొలిగించిన తరువాత ఒక కశ్మీరీ పండిట్ గోహత్యను దైర్యంగా అడ్డుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 హోదా తొలిగించిన తరువాత ఒక కశ్మీరీ పండిట్ గోహత్యను దైర్యంగా అడ్డుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో గోహత్యను అడ్డుకుంటున్నది శ్రీనగర్‌కి చెందిన ఆరిఫ్ జాన్ అనే ఒక ముస్లిం, కశ్మీరీ పండిట్ కాదు. ఈద్ సందర్భంగా తన ఇంటి పక్కన ఉన్న దారుల్-ఉలుం ఖాళీ స్థలంలో గోహత్య నిర్వహిస్తుండగా, తన ఇంటి పక్కన గోహత్య నిర్వహించకుడదని ఆరిఫ్ జాన్ ఆ మసీదు సభ్యులతో గొడవపడ్డాడు. గోహత్య కారణంగా ఇంట్లోకి  చెడువాసన వస్తుందనే కారణంగానే తను ఈ గోహత్యను అడ్డుకున్నట్టు ఆరిఫ్ జాన్ తన ఫేస్బుక్ పోస్టులో చెప్పాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ వీడియోకి సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ ఒక యూసర్ 05 ఆగష్టు 2021 నాడు ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. శ్రీనగర్‌కి చెందిన ఒక ముస్లిం వ్యక్తి దారుల్-ఉలుం మసీదులో నిర్వహిస్తున్న గోహత్యను అడ్డుకుంటున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు. ఈ ఘటన ఈద్ రోజున శ్రీనగర్‌లోని రైనవరి ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు ట్వీట్లో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరొక వీడియోని కూడా ఆ యూసర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ వీడియో పై స్పష్టతనిస్తూ ‘The Kashmir Walla’ న్యూస్ వెబ్సైటు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో  గోహత్యను అడ్డుకుంటున్నది శ్రీనగర్‌కి చెందిన ఆరిఫ్ జాన్ ఒక కశ్మీరీ ముస్లిం అని ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఘటనపై స్పష్టత కోసం ఆరిఫ్ జాన్‌ని సంప్రదిస్తే, “ఈద్ వేడుక సందర్భంగా మా ఇంటి పక్కనే ఉన్న దారుల్-ఉలుం ఖాళి స్థలంలో దాదాపు 20 గోవులను మసీదు సభ్యులు  చంపాలని ప్రయత్నించినప్పుడు, రక్తపు మరకలు మరియు ఇంట్లోకి చెడువాసన వస్తుందని నేను ఆ గోహత్యను అడ్డుకున్నాను”, అని తెలిపినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. 

ఈ విషయం పై స్పష్టతనిస్తూ ఆరిఫ్ జాన్ 17 సెప్టెంబర్ 2021 నాడు తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టారు. ఆరిఫ్ జాన్, తను కేవలం తన ఇంటి పక్కన స్థలంలో గోహత్య నిర్వహించాకుడదని దారుల్-ఉలుం మసీదు సభ్యులతో గొడవపడ్డానని, ఈద్ వేడుక రోజున గోహత్య నిర్వహించాకుడదని తను అనలేదని ఈ పోస్టులో తెలిపాడు. తన వీడియోని కొంతమంది మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆరిఫ్ జాన్ తెలిపాడు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో గోహత్యను అడ్డుకుంటుంది శ్రీనగర్‌కి చెందిన ఒక కాశ్మీరి ముస్లిం అని, కాశ్మీరీ పండిట్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ వీడియోలో గోహత్యను అడ్డుకుంటున్నది శ్రీనగర్‌కి చెందిన ఆరిఫ్ జాన్ ఒక కాశ్మీరి ముస్లిం, కశ్మీరీ పండిట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll