మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూతురు, జార్జ్ సోరోస్‌తో కలిసున్న ఫోటో అంటూ ఒక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూతురు, జార్జ్ సోరోస్‌తో కలిసున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో జార్జ్ సోరోస్‌తో ఉన్నది అతని భార్య టామికో బోల్టన్, మన్మోహన్ సింగ్ కూతురు కాదు. ఈ ఫోటో 2012లో వీళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడు విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ కూతురు అమ్రిత్ సింగ్ జార్జ్ సోరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్ (OSJI)లో పనిచేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC)లో అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఫిలాంత్రోపిస్ట్ జార్జ్ సోరోస్ మాట్లాడుతూ మోదీపై పలు విమర్శలు చేయడంతో పాటు భారత్‌లోని పరిస్థితులపై కూడా వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలోనే జార్జ్ సోరోస్‌తో మన్మోహన్ సింగ్ కూతురు అంటూ ఈ ఫోటో షేర్ అవుతోంది. కానీ ఈ ఫోటోలో సోరోస్‌తో ఉన్నది మన్మోహన్ సింగ్ కూతురు కాదు.
ఫోటోలో ఉన్నది జార్జ్ సోరోస్ భార్య టామికో బోల్టన్. ఈమెను సోరోస్ 2013లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో 2012లో వీళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడు విడుదలైన ఫోటో.
టామికో బోల్టన్ ఒక జపనీస్-అమెరికన్. ఈమె ప్రస్తుతం జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌లో ఒక బోర్డు సభ్యురాలు. బోల్టన్‌కు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
మన్మోహన్ సింగ్ కూతురు:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఉపిందర్ సింగ్, దమన్ సింగ్ & అమ్రిత్ సింగ్ అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఐతే వీరిలో అమ్రిత్ సింగ్ జార్జ్ సోరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్ (OSJI)లో పనిచేసింది.
అమ్రిత్ సింగ్ జార్జ్ సోరోస్ సంస్థలో పని చేసినందువల్ల ఇలాంటి వార్తలు షేర్ చేసి ఉండవచ్చు. కానీ వైరల్ ఫోటోలో ఉన్నది మన్మోహన్ సింగ్ కూతురు కాదు.
చివరగా, ఈ ఫోటోలో జార్జ్ సోరోస్‌తో ఉన్నది అతని భార్య టామికో బోల్టన్, మన్మోహన్ సింగ్ కూతురు కాదు.