Fake News, Telugu
 

వైజాగ్ సమ్మిట్‌లో మంత్రి అమరనాథ్ నూడిల్స్ చేసే వ్యక్తితో MoU చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం

0

ఇటీవల వైజాగ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో , ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ చేసే వ్యక్తితో Memorandum of Understanding (MoU) కుదుర్చుకున్నట్లు చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నూడిల్స్ చేసే వ్యక్తితో MoU కుదుర్చుకున్న ఆంధ్ర ప్రదేశ్ మంత్రి గుడివాడ అమరనాథ్.

ఫాక్ట్: వైజాగ్ సమ్మిట్‌లో మంత్రి అమరనాథ్‌ని కలిసి MoU కుదుర్చుకున్న వ్యక్తి ఓజి ఇండియా ప్యాకేజింగ్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ‘రూయిచి అసాయ్’. ఇక కింది వీడియోలో నూడిల్స్ చేస్తున్నది పుణేలోని ఒక రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి. వారిద్దరూ వేరు వేరు వ్యక్తులు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు. 

ముందుగా, ఈ సమ్మిట్‌కి సంబంధించిన పూర్తి వీడియోని పరిశీలించగా, 12:23 దగ్గర ఓజి ప్యాకేజింగ్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో MoU కుదుర్చుకుంటున్నట్లు చెప్పడం వినవచ్చు. అప్పుడు, ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన ‘రూయిచి అసాయ్’ మంత్రి గుడివాడ అమరనాథ్‌ని కలవడం జరిగింది.

ఇతను వాళ్ళ కంపెనీ తరపున గతంలో కూడా అనేక కార్యక్రమాలకు హాజరయ్యాడు. వాటి వివరాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇక నూడిల్స్ చేస్తున్న వ్యక్తి యొక్క మరింత స్పష్టమైన వీడియో కోసం వెతకగా, ఏప్రిల్ 2018లో అప్‌లోడు చేయబడిన పూర్తి వీడియో లభించింది. ఇందులో నూడిల్స్ చేస్తున్న వ్యక్తి ‘రూయిచి అసాయ్’ కాదని స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో ఉన్న వ్యక్తి పూణేలోనే ‘Wok Masters’ అనే రెస్టారెంట్‌కి చెందిన చెఫ్ అని వీడియో వివరణలో చూడవచ్చు.

చివరిగా, వైజాగ్ సమ్మిట్ లో మంత్రి అమరనాథ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కి చెందిన వ్యక్తితో MoU చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll