Fake News, Telugu
 

డిజిటల్‌గా ఎడిట్ చేసిన న్యూస్ క్లిప్‌ను మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

‘దొంగతనానికెళ్లి చేపలపులుసు తిని నిద్రపోయాడు’ అనే శీర్షికతో ఉన్న ఒక న్యూస్ క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఇలా దొరికిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మహాసేన (సరిపెళ్ళ) రాజేష్ అంటూ ఈ  న్యూస్ క్లిప్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ న్యూస్ క్లిప్‌లో రాజేష్ ఫోటో కూడా జోడించారు. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మహాసేన రాజేష్ దొంగతనానికెళ్లి దొరికిపోయాడని చెప్పే న్యూస్ క్లిప్.

ఫాక్ట్(నిజం): ఈ వార్త జూన్ 2020లో తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన ఘటనకు సంబంధించింది. ఈ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని సతీష్‌గా గుర్తించారు. ఐతే ఈ వార్తను ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఆయన వివరాలు, ఫోటోను డిజిటల్‌గా జోడించి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇది ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఒక పాత న్యూస్ క్లిప్. పైగా ఈ వార్తకు ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధం లేదు. న్యూస్ క్లిప్ మొదట్లో చెన్నై, జూన్ 15 అని రాసి ఉండడం చూడొచ్చు. అలాగే ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, పరైకోడు గ్రామంలో జరిగినట్టు ఈ వార్తలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఐతే ఈ వార్తకు సంబంధించిన అసలైన కథనం కోసం వెతకగా ఆంధ్రజ్యోతి ఈ వార్తను 16 జూన్ 2020న  ప్రచురించిన ఆన్లైన్ కథనం దొరికింది. ఈ కథనంలో కూడా ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగినట్టు స్పష్టంగా రాసి ఉంది. పైగా ఈ దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయిన వ్యక్తి పేరు సతీష్ అని ఈ కథనంలో పేర్కొన్నారు.

అప్పట్లో ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనంలో ఆ దొంగ ఫోటో కూడా ప్రచురించారు. ఈ కథనం కూడా ఆ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని సతీష్‌గా గుర్తించింది.

వైరల్ అవుతంది డిజిటల్‌గా ఎడిట్ చేసిన క్లిప్:

దీన్నిబట్టి ఈ వార్తకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని మహాసేన (సరిపెళ్ళ) రాజేష్‌కు గాని ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఐతే ఈ వార్తను ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఆయన వివరాలు, ఫోటోను డిజిటల్‌గా జోడించి షేర్ చేస్తున్నారు.

వైరల్ క్లిప్‌లోని చివరి రెండు లైన్‌లు చుస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ రెండు లైన్‌లను డిజిటల్‌గా జోడించారు. ఈ లైన్‌ల ఫాంట్ స్టైల్ మిగితా లైన్ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఐతే కొందరు ఈ క్లిప్‌ను వ్యంగ్యంగా షేర్ చేస్తుంటే, మరికొందరు దీనిని నిజమనుకొని షేర్ చేస్తున్నారు.

చివరగా, డిజిటల్‌గా ఎడిట్ చేసిన న్యూస్ క్లిప్‌ను మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll