“రాహుల్ ని చూస్తుంటే మరో మహాత్మా గాంధీని మళ్ళీ చూస్తున్నటే కళ్ళు చెమ్మ గిల్లుతున్నాయి. ఈరోజుల్లో రాహుల్ గాంధీ గారి లాంటి నిజాయితీ గల నాయకుడు దేశంలో వున్నందుకు గర్వంగా చెప్తున్నా నేను ఆయనకు అన్ని విధాలుగా అండగా వుంటా, అవసరమైతే నేనూ తనతో జైలుకు వెళ్ళడానికి సిద్ధమవుతా”, అని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ పేర్కొన్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దపడతానని తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ అన్నారు.
ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ ఇటీవల ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అతనికి భయపడి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించిందని M.K. స్టాలిన్ తన ప్రెస్ నోట్లో ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, దేశంలోని అన్నీ రాజకీయ పార్టీలు దీనికోసం కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. కాని, రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దమని M.K. స్టాలిన్ వ్యాఖ్యానించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దపడతానని తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ ఎప్పుడైనా వ్యాఖ్యలు చేశారా అని వెతికితే, M.K. స్టాలిన్ అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇంటర్నెట్లో ఒక్క న్యూస్ రిపోర్ట్ కూడా దొరకలేదు. M.K. స్టాలిన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎటువంటి ట్వీట్ పెట్టలేదు.
మోదీ ఇంటిపేరుని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై 2019లో నమోదైన పరువు నష్టం కేసుకి సంబంధించి సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ళు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ప్రకటించిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
ఈ చర్యను వ్యతిరేకిస్తూ M.K. స్టాలిన్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రెస్ నోట్లు విడుదల చేశారు. M.K. స్టాలిన్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఒక ఫాసిస్ట్ చర్యగా అభివర్ణిస్తూ, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అతని భారత్ జోడో యాత్ర ప్రభావానికి భయపడి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించిందని తన ప్రెస్ నోట్లో ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, దేశంలోని అన్నీ రాజకీయ పార్టీలు దీనికోసం కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని M.K. స్టాలిన్ కోరారు. M.K. స్టాలిన్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌కు సంబంధించి పబ్లిష్ అయిన వార్తా కథనాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దపడతానని M.K. స్టాలిన్ వ్యాఖ్యానించలేదు.
చివరగా, రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దమని తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ అనలేదు.