వారణాసిలోని బబత్‌పూర్‌లో అత్యాచార బెదిరింపులకు పాల్పడిన 6 మంది ముస్లిం యువకుల గొంతు కోసి పరారీలో ఉన్న దళిత హిందూ యువతి అంటూ ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పైగా ఆరు తెగిపోయిన తలలు బాబత్పూర్ ప్రాంతంలోని పురాతన కాళీ మాత ఆలయంలో దొరికాయని కూడా ఈ న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తున్న పోస్టులలో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వారణాసిలోని బబత్‌పూర్‌లో అత్యాచార బెదిరింపులకు పాల్పడిన 6 మంది ముస్లిం యువకుల గొంతు కోసి పరారీలో ఉన్న దళిత హిందూ యువతి.
ఫాక్ట్(నిజం): వారణాసిలో ఇలాంటి సంఘటనేమీ జరగలేదని, ఈ వార్త పూర్తిగా కల్పితమని పోలీసులు స్పష్టం చేసారు. వైరల్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్‌లను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని పాత న్యూస్ క్లిప్‌లను డిజిటల్‌గా జోడించి రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్తున్నట్టు వారణాసిలోని బబత్‌పూర్‌లో ఇలాంటి ఘటనేది రిపోర్ట్ కాలేదు. ఈ విషయానికి సంబంధించి వివరాల కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఇలాంటి ఘటన జరిగినట్టు రిపోర్ట్ చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు మాకు కనిపించలేదు. పైగా ఈ వార్తను ఖండిస్తూ వారణాసి పోలీసుల గోమతి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు.
వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ బబత్‌పూర్‌లో ఇలాంటి ఘటన ఏది రిపోర్ట్ కాలేదని పోలీసులు స్పష్టం చేసారు. ఐతే పోలీసులు షేర్ చేసిన న్యూస్ క్లిప్‌పై ‘UP Tak’ అనే లోగో గమనించవచ్చు. ఈ లోగో ఆధారంగా వెతకగా ఈ ఘటనను రిపోర్ట్ చేసిన ఎలాంటి వార్తా కథనం వారి వెబ్‌సైట్‌లో మాకు కనిపించలేదు.
పైగా తమ సంస్థ లోగోతో వైరల్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని UP Tak ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
ఇంకా, వైరల్ అవుతున్నది నిజమైన న్యూస్ క్లిప్ కాదు, దీనిని డిజిటల్‌గా రూపొందించారు. వైరల్ అవుతున్న వార్తాతో పాటు ప్రచురితమైన ఇతర వార్తలు మరియు ఫోటోలను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.
‘Web Dunia’ అనే న్యూస్ పోర్టల్ మధ్యప్రదేశ్ బడ్జెట్‌కు సంబంధించిన మార్చి 2022లో ప్రచురించిన వార్తను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వారి వార్తా కథనాలలో ప్రచురించిన పోలీసుల ఫైల్ ఫోటో, మొదలైన కొన్ని పాత న్యూస్ క్లిప్‌లను డిజిటల్‌గా జోడించి ఈ న్యూస్ క్లిప్‌ను రూపొందించారు.
చివరగా, వారణాసిలో ఒక దళిత మహిళ అత్యాచార బెదిరింపులకు పాల్పడిన ముస్లిం యువకుల తల నరికి చంపిందన్న వార్త పూర్తిగా కల్పితం.