Fake News, Telugu
 

గత పదేళ్లలో కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించే నిధుల శాతం పెద్దగా పెరగలేదు

0

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ప్రదర్శన నేపథ్యంలో అసలు ప్రభుత్వాలు క్రీడలపై ఎంత ఖర్చు చేస్తున్నారన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయిస్తుందని అర్ధం వచ్చేలా 2012-21 వరకు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లలో క్రీడలకు కేటాయించిన మొత్తం వివరాలను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనంలో ఆ వివరాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయిస్తుంది.

ఫాక్ట్ (నిజం): గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంతో పోలిస్తే బీజేపీ హయాంలో క్రీడా రంగానికి నికరంగా జరిగిన కేటాయింపుల ఎక్కువే అయినప్పటికీ, ఇది సహజంగా జరిగే పెరుగుదల మాత్రమే. సాధారణంగా, ప్రతీ ఆర్ధిక వ్యవస్థ (జీడీపీ) పెరుగుతూ వస్తుంది కాబట్టి, ఈ పెరుగుదలకు అనుగుణంగానే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా క్రీడా రంగానికి కేటాయింపులు పెరిగాయే తప్ప మొత్తంగా బడ్జెట్ కేటాయింపులలో క్రీడా రంగం వాటా గత ప్రభుత్వాల సమయాల్లో ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతుంది. గత పదేళ్లలో కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించే నిధుల శాతం పెద్దగా పెరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో బీజేపీ హయాంలో క్రీడా రంగానికి ఆయా సంవత్సరాల బడ్జెట్‌లలో జరిపిన కేటాయింపుల వివరాలు ఇంచుమించు సరైనవే. కాంగ్రెస్ హయాంకి సంబంధించిన రెండు సంవత్సరాల కేటాయింపులలో కొంత తేడా ఉంది. 2012-13 మరియు 2013-14 సంవత్సరాలకు సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ వివరాలను క్రీడా రంగానికి జరిపిన కేటాయింపులుగా పేర్కొన్నారు, కాని ఈ వివరాలు ఫైనల్ కాదు. నిజానికి ఫైనల్ బడ్జెట్ కేటాయింపులు దీనికన్నా కొంత తక్కువగానే ఉన్నాయి, ఈ వివరాలు కింది టేబుల్‌లో చూడొచ్చు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ హయాంలో బడ్జెట్‌లో క్రీడలకు నికరంగా జరిపిన కేటాయింపుల విలువ పెరిగిన మాట నిజమైనప్పటికి, ఇది సహజంగా జరిగే పెరుగుదల మాత్రమే. సాధారణంగా ప్రతీ ఆర్ధిక వ్యవస్థ (జీడీపీ) పెరుగుతూ వస్తుంది కాబట్టి, ఈ పెరుగుదలకు అనుగుణంగానే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా క్రీడా రంగానికి కేటాయింపులు పెరిగాయే తప్ప మొత్తంగా బడ్జెట్ కేటాయింపులలో క్రీడా రంగం వాటా గత ప్రభుత్వాల సమయాల్లో ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతుంది. కేవలం ఈ నికర విలువని పరిగణిస్తే కేటాయింపులపై మనకు స్పష్టమైన అవగాహన రాదు.

ఒకవేళ కేటాయింపులకు సంబంధించి వివిధ ప్రభుత్వాల వైఖరిని పోల్చాలనుకుంటే, ఆయా సంవత్సరాలలో ప్రభుత్వం అన్ని రంగాలకు కలిపి చేసిన మొత్తం కేటాయింపులలో క్రీడలకు ఎంత శాతం కేటాయించారో అన్న అంశాన్ని విశ్లేషిస్తే మనకు కొంత కచ్చితమైన అవగాహాన వస్తుంది. 2009 నుండి 2021 వరకు కేంద్ర బడ్జెట్ లో క్రీడలకు జరిపిన కేటాయింపులకు సంబంధించిన వివరాలు కింది టేబుల్ లో చూడొచ్చు.

 పై టేబుల్‌లోని సమాచారాన్ని పరిశీలిస్తే 2011-12 నుండి ఇటీవల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలు కలుపుకొని చేసే మొత్తం కేటాయింపులలో  క్రీడా రంగం యొక్క వాటాలో పెద్దగా పెరుగుదలైతే  ఏమి లేదు. ఉదాహారణకి 2012-13లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలు కలుపుకొని చేసే మొత్తం కేటాయింపుల విలువ  రూ. 14.9 లక్షల కోట్లు కాగా ఇందులో 0.07% అంటే సుమారు రూ. 1,041 కోట్లు క్రీడా రంగానికి కేటాయించారు. 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా 0.07% – 0.09% పరిధిలోనే క్రీడా రంగానికి కేటాయిస్తూ వచ్చింది.

2016లో రియో ఒలింపిక్స్, 2018లో కామన్వెల్త్ గేమ్స్, 2020/2021లో టోక్యో ఒలింపిక్స్ ఉన్న సందర్భాలలో కూడా బడ్జెట్ లో క్రీడా రంగం వాటా పెద్దగా పెరగలేదు. వీటన్నిటిబట్టి, గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం క్రీడా రంగానికి బడ్జెట్ లో కేటాయించిన వాటాలో పెద్దగా మార్పు లేదన్న విషయం స్పష్టమవుతుంది.

చివరగా, గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడా రంగానికి ఒకే రకంగా కేటాయింపులు జరిపాయి. గత పదేళ్లలో కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించే నిధుల శాతం పెద్దగా పెరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll