Fake News, Telugu
 

ట్రాక్టర్ ర్యాలీ లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని నిరసనకారులు తీసేయలేదు

0

గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసేసి, ఖలిస్తాన్ జెండా ఎగరవేశారని చెప్తున్న ఒక ట్వీట్ ఫోటోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోని పెట్టి, ‘ఇలాంటివి దేశాన్ని అవమానిస్తాయి…ఈ నకిలీ రైతులను కాల్చివేస్తే తప్పేంటి?’, అని ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసేసి, ఖలిస్తాన్ జెండా ఎగరవేసినట్టు ఫోటోలో చూడవొచ్చు.

ఫాక్ట్: ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసేయలేదు. ట్వీట్ లోని ఫోటోల్లో ఉన్నది త్రివర్ణ పతాకం ఉన్న పోల్ కాదు. ఎర్ర కోట లోని వేరే ప్రదేశాల్లో వివిధ జెండాలను నిరసనకారులు ఎగరవేశారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ట్వీట్ గురించి వెతకగా, ఆ ట్వీట్ ని ఇప్పుడు తీసేసినట్టు తెలిస్తుంది. కానీ, ఆ ట్వీట్ ఆర్కైవ్డ్ వెర్షన్ మాత్రం లభించింది.

ట్వీట్ లోని ఫోటోల గురించి వెతకగా, ఆ ఫోటోలకి సంబంధించిన వీడియోలు దొరుకుతాయి. ‘ANI’ మరియు ‘ఇండియా టీవీ’ వారు పెట్టిన వీడియోల్లో, ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసేయలేదని చూడవొచ్చు. ఎర్ర కోటలో ఉన్న వేరే పోల్ మీద వేరే జెండాలను కొందరు వ్యక్తులు ఎగరవేసినట్టు తెలుస్తుంది. కింద ఫోటోలో త్రివర్ణ పతాకం మరియు వేరే జెండా ఎగరవేసిన పోల్ యొక్క స్థానాలు చూడవొచ్చు.

అయితే, ఎర్ర కోట లోని పోల్ మీద ఎగరవేసింది ఖలిస్తాన్ జెండా కాదని, అది సిక్కు మతానికి చెందిన ‘నిషాన్ సాహిబ్’ జెండా అని కొందరు రిపోర్ట్ చేసారు. ‘నిషాన్ సాహిబ్’ జెండా కి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

కేవలం పోస్ట్ చేసిన ఫోటోలోని జెండానే కాదు, వివిధ జెండాలను ఎర్ర కోట లోని వివిధ ప్రదేశాల్లో ఎగరవేసినట్టు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

ఈ ఘటన కి సంబంధించి వేరే కొన్ని వీడియెలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఒక వీడియోలో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని పోల్ మీద పెట్టడానికి అందిస్తే, పోల్ మీద ఉన్న వ్యక్తి దాన్ని పక్క వేసినట్టు చూడవొచ్చు. మరో వీడియోలో త్రివర్ణ పతాకం కింద వేరే జెండాలు పెట్టినట్టు చూడవొచ్చు.

అసలు ట్రాక్టర్ ర్యాలీ లో ఏం జరిగింది?

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్నారు. ఆ నిరసనల్లో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ నగరంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాలీ కి సంబంధించిన రూట్ మ్యాప్ ని 24 జనవరి 2021 న ‘కిసాన్ ఏక్తా మోర్చా’ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.

అయితే, అనుకున్న రూట్లలో కాకుండా వేరే రూట్లలో రైతులు సమయానికి ముందే వెళ్లారని, దాని వల్ల జరిగిన విధ్వంసంలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయి అని ‘ANI’ తో ఢిల్లీ పోలీస్ కమీషనర్ తెలిపారు.

కొన్ని చోట్ల నిరసనకారులు బారికేడ్లను ఎలా తొలగించారో ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

మంగళవారం జరిగిన ఘటనల పై ఇప్పటికే పోలీసులు సుమారు 22 FIR లను నమోదు చేసినట్టు తెలిసింది. సుమారు 200 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ట్రాక్టర్ ర్యాలీ లో భాగంగా జరిగిన ఘటనల్లో ఎర్ర కోట మీద భారతదేశ త్రివర్ణ పతాకాన్ని నిరసనకారులు తీసేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll