Fake News, Telugu
 

92 సంవత్సరాల వయసులో చనిపోయిన ఈ థాయిలాండ్‌ మతగురువు లుయాంగ్ ఫోర్ పియాన్‌ వద్ద మోదీని ప్రస్తావిస్తూ రాసిన కాగితం దొరకలేదు

0

నేపాల్ పర్వతాలలో కనుగొన్న 201 సంవత్సరాల టిబెట్ సన్యాసి దగ్గర నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ రాసిన ఒక పురాతన కాగితం దొరికింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ టిబెట్ సన్యాసి దగ్గర దొరికిన కాగితంపై “మోది అనే యోధుడు వస్తాడు” అని రాసి ఉందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే ఫోటోని షేర్ చేస్తూ పెట్టిన మరొక పోస్టులో, ఆ వృద్ధ టిబెట్ సన్యాసి దగ్గర దొరికిన పురాతన కాగితంపై, “మోది అనే ఒక చదువు సంధ్య లేని వ్యక్తి వచ్చి భారత దేశానికి ప్రధాని అవుతాడు.. అతను ప్రధాని అయిన తర్వాత దేశం సంక నాకి పోతుంది” అని రాసి ఉందని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నేపాల్ పర్వతాలలో కనుగొన్న 201 సంవత్సరాల టిబెట్ సన్యాసి దగ్గర నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ రాసిన ఒక పురాతన కాగితం దొరికింది.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది 92 సంవత్సరాల వయసులో చనిపోయిన లుయాంగ్ ఫోర్ పియాన్ అనే బౌద్ధ సన్యాసి యొక్క శవం. 2017లో ఆరోగ్య సమస్యల కారణంగా లుయాంగ్ ఫోర్ పియాన్‌ బ్యాంకాక్‌లోని ఒక ఆసుపత్రిలో చనిపోయారు. చనిపోయిన రెండు నెలల తరువాత లుయాంగ్ ఫోర్ పియాన్‌ వస్త్రాలు మార్చడానికి అతని శవాన్ని సమాధి నుండి బయటికితీసారు. ఈ ఫోటో అప్పుడే తీసినదే. ఈ ఫోటోతో నరేంద్ర మోదీకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.     

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘The Daily Mail’ న్యూస్ సంస్థ 22 జనవరి 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో నవ్వుతు కనిపిస్తున్నది లుయాంగ్ ఫోర్ పియాన్ అనే బౌద్ధ సన్యాసి యొక్క శవమని ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. 2017లో ఆరోగ్య సమస్యల కారణంగా లుయాంగ్ ఫోర్ పియాన్‌ బ్యాంకాక్‌లోని ఒక ఆసుపత్రిలో చనిపోయినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. లుయాంగ్ ఫోర్ పియాన్‌ చనిపోయినప్పుడు అతని వయసు 92 సంవత్సరాలు.

కంబోడియా దేశానికి చెందిన లుయాంగ్ ఫోర్ పియాన్, తన జీవితంలోని అధిక భాగం మధ్య థాయిలాండ్‌ ప్రావిన్సులోని లోప్‌బురిలో సుప్రసిద్ధ బౌద్ధ గురువుగా పనిచేశారు. లుయాంగ్ ఫోర్ పియాన్ చనిపోయిన తరువాత అతని శవాన్ని తను పనిచేసిన ఆశ్రమంలో సమాధి చేసారు. చనిపోయిన రెండు నెలల తరువాత పియాన్ వస్త్రాలను మార్చడానికి అతని శవాన్ని సమాధి నుండి తిరిగి బయటికి తీసినట్టు తెలిసింది. రెండు నెలల తరువాత వెలికి తీసిన లుయాంగ్ ఫోర్ పియాన్ శవం ఇంకా నవ్వుతూ కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచినట్టు పలు న్యూస్ సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

2015లో మంగోలియా దేశంలో ధ్యాన భంగిమలో కూర్చున్న ఒక 200 సంవత్సరాల వయసు కలిగి ఉన్న బౌద్ధ సన్యాసి దొరికారని పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. చనిపోయినట్టుగా భావిస్తున్న ఈ 200 సంవత్సరాల వయసు గల బౌద్ధ మత గురువు తీవ్రమైన ధ్యానంలో ఉన్నారని, ఇంకా చనిపోలేదని బౌద్ధ మతపెద్దలు అప్పుడు తెలిపారు. కాని, ఈ బౌద్ధ సన్యాసి దగ్గర నరేంద్ర మోది గురించి ప్రస్తావిస్తూ రాసిన ఒక పురాతన కాగితం దొరికిందని ఎక్కడ రిపోర్ట్ అవలేదు.

చివరగా, 92 సంవత్సరాల వయసులో చనిపోయిన ఈ థాయిలాండ్‌ మతగురువు లుయాంగ్ ఫోర్ పియాన్‌ వద్ద మోదీని ప్రస్తావిస్తూ రాసిన కాగితం దొరకలేదు.

Share.

About Author

Comments are closed.

scroll