Fake News, Telugu
 

బ్రిటీష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ 2011 చేసిన చర్చలో జగన్ మోహన్ రెడ్డిని అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడిగా పేర్కొనలేదు

0

జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు” అని బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు” అని బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ అన్నాడు.

ఫాక్ట్ (నిజం): “జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు” అని బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2011లో జరిగిన ఒక డిబేట్ లో పాట్రిక్ ఫ్రెంచ్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమాంతంగా పెరిగిన జగన్ ఆస్తులు మరియు ఆదాయం గురించి ప్రస్తావించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, పాట్రిక్ ఫ్రెంచ్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు గనక చేసుంటే, వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. పాట్రిక్ ఫ్రెంచ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా లేదు.

కాకపోతే, 27 సెప్టెంబర్ 2011న జరిగిన ఒక డిబేట్‌లో, పాట్రిక్ ఫ్రెంచ్ జగన్ మోహన్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. పాట్రిక్ ఫ్రెంచ్, ఆ డిబేట్ వీడియోలో, ఒక్క జగన్ మోహన్ రెడ్డి గురించి మాత్రమే కాకుండా, భారత దేశంలో జరిగే అవినీతి, ఇతర ఎంపీల గురించి కూడా చెప్పారు.

రెండు సంవత్సరాల క్రితం తండ్రి మరణించిన తర్వాత జగన్ రెడ్డి వంటి వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. అతని తండ్రి ఆ రాష్ట్రాన్ని నడుపుతున్న కొద్ది కాలంలోనే 65 మిలియన్ పౌండ్ల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తిగా మారాడు. కొన్ని నెలల క్రితం 75 గదుల ప్యాలెస్ తనకోసం కట్టుకున్నాడు, ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.”

కానీ, ఎక్కడా కూడా వీడియోలో జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతి పెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు అని పాట్రిక్ ఫ్రెంచ్ అనలేదు.

చివరగా, బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ 2011లో జగన్ మోహన్ రెడ్డి గురించి చేసిన ప్రస్తావనలో జగన్ దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు అని పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll