హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన టిఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుని ఇల్లందుకుంట ప్రజలు అడ్డుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నికముందో చూద్దాం.
క్లెయిమ్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన హరీష్ రావుని ఇల్లందుకుంట ప్రజలు అడ్డుకుంటున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఘర్షణ 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వీడియో హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘YOYO TV’ యూట్యూబ్ ఛానెల్ 28 అక్టోబర్ 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తెరాస కార్యకర్తలు ఘర్షణ పడుతున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, దుబ్బాకలో చోటుచేసుకున్న ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ ‘HMTV’ న్యూస్ ఛానల్ ‘28 అక్టోబర్ 2020’ నాడు ఒక వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్బంగా అప్పనపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన టిఆర్ఎస్ కార్యకర్తలకు, అదే సమయంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు తోపులాట జరిగినట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఘర్షణకు కారణం టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అని ఎక్కడా రిపోర్ట్ కాలేదు.
పోస్టులో షేర్ చేసిన వీడియోలో చూపిస్తున్న ఘర్షణ తమ గ్రామంలో జరగలేదని ఇల్లందుకుంట టిఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆధారాలు చూపుతూ ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో జరిగిందని, హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన వీడియోని హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుని ఇల్లందుకుంట ప్రజలు అడ్డుకుంటున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.