Fake News, Telugu
 

ఘాజియాబాద్‌లో ఆహారంలో మూత్రం కలిపినట్లు ఆరోపించబడిన మహిళ ముస్లిం కాదు

0

ఒక ముస్లిం పనిమనిషి తన మూత్రాన్ని ఆహారంలో కలుపుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఆమె కొన్నేళ్లుగా ఇలా చేస్తోందని, ఫలితంగా కుటుంబ సభ్యుల్లో కాలేయ సమస్యలు వచ్చినట్టు ఈ పోస్ట్ పేర్కొంది. ఈ కథనం ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ వీడియోలో ఆహారంలో మూత్రాన్ని కలుపుతున్న ఒక ముస్లిం పనిమనిషి.

ఫాక్ట్(నిజం): ఈ ఘటనలో ఆహారంలో మూత్రం కలిపారని ఆరోపించబడిన మహిళ ముస్లిం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో ఆ పనిమనిషి రీనా అని గుర్తించారు. పాత్రలో మూత్ర విసర్జన చేసి, దాన్ని పిండిలో కలిపి రోటీలు చేస్తున్న దృశ్యాన్ని యజమాని వీడియో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన యజమాని నిరంతరం పర్యవేక్షించడం, తిట్టడం వల్ల కోపంతో తాను ఇలా చేశానని రీనా అంగీకరించింది. ఎఫ్‌ఐఆర్ కాపీలో కూడా ఆమె పేరు ప్రమోద్ కుమార్ భార్య అని స్పష్టంగా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా,మాకు సంఘటనను వివరిస్తున్న మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం, తన యజమానులకు రోటీలు చేయడానికి పిండిలో మూత్రాన్ని కలిపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 32 ఏళ్ల పనిమనిషి రీనా అరెస్టు అయ్యింది. పాత్రలో మూత్ర విసర్జన చేసి, దానిని పిండిలో కలుపుతున్న దృశ్యాన్ని ఆమె యజమాని వీడియో రికార్డ్ చేయడంతో ఈ ఘటన బయటపడింది. తన యజమాని తనను నిశితంగా పరిశీలిస్తున్నాడని, చిన్నచిన్న పొరపాట్లకు తనను తిట్టడంతో కోపంతో అలా చేశానని రీనా పోలీసుల ఎదుట అంగీకరించింది.

మేము ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కనుగొన్నాము. దీంట్లో స్పష్టంగా ఆరోపితురాలి పేరు రీనా, ప్ర‌మోద్ కుమార్ భార్య అని రాసి ఉంది.

చివరిగా, ఘాజియాబాద్‌లో ఆహారంలో మూత్రం కలిపినట్లు ఆరోపించబడిన మహిళ ముస్లిం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll