Fake News, Telugu
 

CNN సర్వేలో ప్రపంచంలోనే బీజేపీ నాలుగో అత్యంత అవినీతిపర రాజకీయ పార్టీగా నిలిచిందన్న వార్త నిజం కాదు

0

CNN సర్వేలో ‘ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ పార్టీల్లో బీజేపీ నాలుగో స్థానంలో ఉందని’ చెప్తున్న ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ న్యూస్ క్లిప్ ప్రకారం ఈ లిస్టులో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ PML(N) మొదటి స్థానంలో ఉంది. ఈ కథనం ద్వారా వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ పార్టీల్లో బీజేపీ నాలుగో స్థానం’ – CNN సర్వే

ఫాక్ట్(నిజం): CNN సంస్థ అవినీతి రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి సర్వే నిర్వహించలేదు. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసింది. గతంలో కూడా ఇలానే BBC/FOX/CNN మొదలైన సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు చక్కర్లు కొట్టాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మొదటగా CNN సంస్థ అవినీతి రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి సర్వే నిర్వహించలేదని మా పరిశోధనలో తెలిసింది. CNN లాంటి ఒక ప్రముఖ సంస్థ ఇలాంటి ఒక సర్వే నిర్వహించి ఉంటే మన దేశంలో మీడియా, ప్రపంచ మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి వార్తా కథనాలేవి మాకు కనిపించలేదు.

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ మొదలైన సంస్థలు ప్రచురించిన నివేదికల ఆధారంగా CNN ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలపై గతంలో కథనాలను ప్రచురించింది. కాని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు బీజేపీ ప్రపంచంలోనే నాలుగో అవినీతి రాజకీయ పార్టీగా తెలుస్తూ ఎటువంటి సర్వే నిర్వహించలేదు.

పైగా పోస్టులో షేర్ చేసిన న్యూస్ క్లిప్‌లో వార్తా సంస్థ పేరు, తేదీ వివరాలు లేవు, దీన్నిబట్టి ఈ న్యూస్ క్లిప్ నిజమైంది కాదని, ఎవరో డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఇలాగే గతంలో కూడా పలు రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ కొన్ని ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్  అయ్యాయి. BBC నిర్వహించిన అవినీతి రాజకీయ పార్టీల సర్వేలో వైఎస్ఆర్సీపీ/తెలుగు దేశం/ బీజేపీ పార్టీలు ఉన్నాయని, FOX సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ ప్రపంచంలోనే రెండో అవినీతి ప్రధాని అని కూడా ఒక ఫేక్ సర్వే చక్కర్లు కొట్టింది. ఐతే అప్పట్లో ఆయా సంస్థలు ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపడేసాయి.

చివరగా, CNN సర్వేలో ప్రపంచంలోనే బీజేపీ నాలుగో అత్యంత అవినీతి రాజకీయ పార్టీగా నిలిచిందన్న వార్త నిజం కాదు. అసలు CNN సంస్థ అలాంటి సర్వే ఏది నిర్వహించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll