Fake News, Telugu
 

ఉత్తరాఖండ్‌లో గత ఏడాది ఓ చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేసినప్పటి దృశ్యాలను పల్నాడులో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

0

పల్నాడుజిల్లా బొల్లాపల్లి మండలంలో ఇద్దరు మహిళపై దాడి చేసిన పులి.. ‘ అనే క్లెయిముతో  ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పులి ఇద్దరు మహిళలను వెంటాడుతూ వారిపై దాడి చేయడం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లిలో ఇద్దరు మహిళలపై ఒక చిరుత దాడి దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): వీడియోలోని సంఘటన పల్నాడులో జరగలేదు. ఇది 2022 నవంబర్ నెలలో ఉత్తరాఖండ్‌లో జరిగింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెప్తున్నట్లు వీడియోలో ఉన్న చిరుత దాడికి సంబంధించిన సంఘటన పల్నాడులో జరిగిందా అని సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు ఎటువంటి సంబంధిత వార్త కథనాలు లభించలేదు.

అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు వివరాలు ఏంటో తెలుసుకోవటానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. దీని ద్వారా, ఈ సంఘటన నవంబర్ 2022లో ఉత్తరాఖండ్‌లో జరిగింది అని తెలిసింది.

ఈ వివరాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని మల్లి మిరై అనే గ్రామంలో నవంబర్ 2022లో ఈ సంఘటన జరిగింది (ఇక్కడ మరియు ఇక్కడ).  బాచులి దేవి మరియు పుష్ప దేవి అనే ఇద్దరు మహిళలు ఇంటి పనులు చేసుకొంటూ ఉండగా, ఒక చిరుతపులి వారిపై దాడి చేసింది(ఇక్కడ). ఈ సంఘటనలో వారిద్దరికీ గాయాలు అయ్యాయి.

చివరిగా, గత ఏడాది నవంబర్లో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు మహిళలపై చిరుతపులి చేసిన దాడికి చెందిన దృశ్యాలను  పల్నాడులో జరిగినట్లు తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll