Fake News, Telugu
 

ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న సావర్కర్ విగ్రహం నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలోనిది కాదు

0

దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో DRDO సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్‌ను ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో, గతంలో ఆయన నాగపూర్‌లోని  RSS ప్రధాన కార్యాలయంలో ఆయన సావర్కర్ విగ్రహానికి నమస్కరించారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల అరెస్ట్ అయిన DRDO సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ నాగపూర్‌లోని  ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన సావర్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న సావర్కర్ విగ్రహం దెర్వాన్ గ్రామంలో ఉన్న వాలవల్కర్ మెడికల్ కాలేజీ & ఆసుపత్రిలోనిది,  నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలోనిది కాదు. 26 ఫిబ్రవరి 2021లో సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రదీప్ కురుల్కర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా రెండవ ఫోటోలో ఉన్న బోర్డులో ఉన్న సమాచారం ఆధారంగా ఇంటర్నెట్లో వెతకగా, సావర్కర్‌కు ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న ఫోటో ‘శ్రీ విఠల్ రావు జోషి చారిటబుల్ ట్రస్ట్’ వారిచే నడపబడుతున్న ‘శ్రీ క్షేత్ర దెర్వాన్ మాస పత్రిక’ ఏప్రిల్ 2021 సంచికలో ప్రచురించినట్లు కనుగొన్నాము.

ఈ పత్రికలో ఉన్న సమాచారం ప్రకారం, 26 ఫిబ్రవరి 2021లో సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రదీప్ కురుల్కర్ మహారాష్ట్రలో ఉన్న దెర్వాన్ గ్రామంలో ఉన్న వాలవల్కర్ మెడికల్ కాలేజీ & ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అదే ప్రాంగణంలో ఉన్న సావర్కర్ విగ్రహానికి ఆయన నమస్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను కింద చూడవచ్చు.     

అలాగే,  వైరల్ ఫోటోలో ఉన్న సావర్కర్ విగ్రహం వాలవల్కర్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్లో ఉన్నట్లు గూగుల్ ఫొటోల ద్వారా కూడా నిర్ధారించవచ్చు.

చివరిగా, ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న సావర్కర్ విగ్రహం దెర్వాన్ గ్రామంలో ఉన్న వాలవల్కర్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్‌లోనిది,  నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలోనిది కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll