Fake News, Telugu
 

రిషికేశ్‌లో గంగా ఘాట్ దగ్గర మద్యం సేవిస్తున్న కొందరు యువకులను పూజారి కొడుతున్న పాత వీడియోని కుల వివక్ష నేపథ్యంతో షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగువ కులానికి చెందిన కొందరు యువకులు గంగా నదిలో స్నానం చేసినందుకు ఒక బ్రాహ్మణ పూజారి వారిని కొడుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. దేశంలో కుల వివక్ష ఇంకా నశించిపోలేదని, తక్కువ కులస్థులను నదిలో స్నానం చేయవద్దని, కోనేరులో స్నానం చేయవద్దని ఇప్పటికీ అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు ఆదేశిస్తున్నారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో దిగువ కులానికి చెందిన యువకులు గంగా నదిలో స్నానం చేసినందుకు ఒక బ్రాహ్మణ పూజారి వారిని చితకబాదిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా ఘాట్ దగ్గర కొందరు పర్యాటకులు మద్యం సేవించి నదిని అపవిత్రం చేస్తున్నారని ఒక పూజారి ఆగ్రహంతో ఆ పర్యాటకులని బెత్తంతో కొడుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు కుల వివక్ష నేపథ్యం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NMF News’ అనే న్యూస్ ఛానెల్ 17 మే 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా ఘాట్ దగ్గర మద్యం సేవిస్తూ నదిని అపవిత్రం చేస్తున్న కొందరు యువకులను పూజారి కొడుతున్న దృశ్యాలంటూ ఈ వీడియోలో తెలిపారు.

రిషికేశ్‌లోని గంగా ఘాట్ దగ్గర కొందరు పర్యాటకులు మద్యం సేవించి నదిని అపవిత్రం చేస్తుండటంతో ఆగ్రహించిన పూజారి ఆ పర్యాటకులను బెత్తంతో చితకబాదినట్టు పలు వార్తా సంస్థలు ఈ వీడియోని షేర్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో దెబ్బలు తింటున్న యువకులు తక్కువ కులానికి చెందిన వారని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.ఈ ఘటనకు కుల వివక్ష నేపథ్యం లేదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రిషికేశ్‌లో గంగా ఘాట్ దగ్గర మద్యం సేవిస్తున్న యువకులను పూజారి కొడుతున్న పాత వీడియోని కుల వివక్ష నేపథ్యంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll