Fact Check, Fake News, Telugu
 

తెలంగాణ లో కలకలం రేపే అంతగా మిస్సింగ్ కేసులు ఆకస్మికంగా పెరిగిపోలేదు

0

తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయని, నాలుగు రోజుల్లోనే (26 అక్టోబర్ 2020 నుండి 29 అక్టోబర్ 2020) 206 కేసులు నమోదు అయ్యాయి అని చెప్తూ, ‘NTV’ వార్త (ఆర్కైవ్డ్) యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలో కలకలం రేపుతున్న మహిళల మిస్సింగ్ కేసులు, 4 రోజుల్లోనే 206 కేసులు నమోదు.

ఫాక్ట్: నాలుగు రోజుల్లో 250 కి పైగా మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయిన మాట వాస్తవమే అయినా, ఆకస్మికంగా ఇప్పుడు తెలంగాణ లో కలకలం రేపే అంతగా మిస్సింగ్ కేసులు పెరిగిపోలేదు. అక్టోబర్ 2020 నెలలో 1425 మిస్సింగ్ కేసులు నమోదు అయిన్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి వెబ్సైటులో చూడవొచ్చు; అంటే సగటున రోజుకు 46 కేసులు. గత సంవత్సరం తెలంగాణలో రిపోర్ట్ అయిన మిస్సింగ్ వ్యక్తుల రోజువారీ సగటుకు, అక్టోబర్ 2020 నెలలో రిపోర్ట్ అయిన రోజువారీ సగటుకు పెద్ద తేడా లేదు. అంతేకాదు, 2019 లో మిస్సింగ్ అయిన వ్యక్తుల్లో 85 శాతం మంది తిరిగి దొరికినట్టు తెలిసింది. కావున, ‘తెలంగాణలో కలకలం రేపుతున్న మహిళల మిస్సింగ్ కేసులు’ అని పోస్ట్ లో చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి వెబ్సైటులో మిస్సింగ్ రిపోర్ట్స్ చూడగా, 26, 27, 28 మరియు 29 అక్టోబర్ 2020 తేదీల్లో 250 కి పైగా మిస్సింగ్ కేసులు నమోదు అయిన్నట్టు తెలుస్తుంది. ఆ మిస్సింగ్ కేసుల్లో 70 కి పైగా మగవారు కూడా ఉన్నారు. కావున, పోస్ట్ లో చెప్పిన లెక్కలు దాదాపు నిజమే. అయితే, మిస్సింగ్ కేసులు రాష్ట్రంలో కలకలం సృష్టించే అంతగా పెరిగాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

2019 లో తెలంగాణ రాష్ట్రంలో 17150 వ్యక్తులు (6485 మగవారు, 10665 ఆడవారు) మిస్సింగ్ కేసుల్లో రిపోర్ట్ అయినట్టు ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (NCRB)’ వారు రిలీజ్ చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా – 2019’ రిపోర్ట్ లో చూడవొచ్చు; అంటే సగటున రోజుకు 47 వ్యక్తులు మిస్సింగ్ కేసుల్లో రిపోర్ట్ అయ్యారు. అక్టోబర్ 2020 నెలలో 1425 మంది మిస్సింగ్ అయిన్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి వెబ్సైటులో చూడవొచ్చు; అంటే సగటున రోజుకు 46 వ్యక్తులు. గత సంవత్సరం తెలంగాణలో రిపోర్ట్ అయిన మిస్సింగ్ వ్యక్తుల రోజువారీ సగటుకు, అక్టోబర్ 2020 నెలలో రిపోర్ట్ అయిన రోజువారీ సగటుకు పెద్ద తేడా లేదు. 2018, 2017 మరియు 2016 సంవత్సరాల వివరాలు కింద టేబుల్ లో చూడవొచ్చు.

అంతేకాదు, 2019 లో మిస్సింగ్ అయిన వ్యక్తుల్లో 85 శాతం మంది తిరిగి దొరికినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (NCRB)’ రిపోర్ట్ లో చూడవొచ్చు. తెలంగాణ రాష్ట్రం లో ఈ రికవరీ రేట్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, రికవరీ రేట్లలో 2019 లో అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ తరువాత రాష్ట్రాల లిస్టులో  తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. కావున, ఆకస్మికంగా ఇప్పుడు తెలంగాణ లో కలకలం రేపే అంతగా మిస్సింగ్ కేసులు పెరిగిపోలేదు. అంతే కాదు, దేశ వ్యాప్తంగా 2019లో సగటున రోజుకు 1042 మిస్సింగ్ కేసులు నమోదు అయినట్టు NCRB రిపోర్ట్ లో తెలిపింది.

మిస్సింగ్ అయ్యే వ్యక్తులు వివిధ కారణాల వల్ల అదృశ్యం అవుతుంటారని, వాళ్ళలో చాలా మంది తిరిగి దొరుకుతుంటారని ‘క్రైమ్ ఇన్ తెలంగాణ – 2018’ రిపోర్ట్ లో చూడవొచ్చు. అంతేకాదు, ఇలాంటి వార్తలే గత సంవత్సరం వచ్చినప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, తెలంగాణ లో కలకలం రేపే అంతగా మిస్సింగ్ కేసులు ఆకస్మికంగా పెరిగిపోలేదు. అక్టోబర్ 2020 లో రిపోర్ట్ అయిన రోజువారీ సగటు మరియు గత సంవత్సరం రోజువారీ సగటుకు పెద్ద తేడా లేదు.

Share.

About Author

Comments are closed.

scroll