Fake News, Telugu
 

చైనా పాఠశాలల్లో పిల్లలకు తల్లితండ్రులు పనిచేస్తున్న వీడియోలను చూపిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదు

0

“చైనా పాఠశాలల్లో పిల్లల కు వారి తల్లిదండ్రులు ఎలా కష్టపడి సంపాదిస్తున్నారు అనే వీడియోలు చూపించి నైతిక ప్రవర్తన కలుగజేస్తున్నారు”, అని చెప్తూ క్లాస్ రూమ్ లో స్క్రీన్ వైపు చూస్తూ ఏడుస్తున్న విద్యార్ధుల వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: చైనా పాఠశాలల్లో పిల్లలకు వారి తల్లిదండ్రులు ఎలా కష్టపడి సంపాదిస్తున్నారు అనే వీడియోలు చూపించి నైతిక ప్రవర్తన కలుగజేస్తున్నారు.

ఫాక్ట్: ఈ విషయం గురించి చైనా ప్రభుత్వం కానీ, వార్తా సంస్థలు కానీ ఎక్కడా ప్రకటించలేదు. వైరల్ వీడియో బోర్డు పైన కనిపిస్తున్న దృశ్యాలు ఎడిట్ చేసినవి. మరియు విద్యార్ధులు ఏడుస్తున్న దృశ్యాలు కూడా వేరే సందర్భంలోనివి. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా చైనాలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు చైనా వార్తా సంస్థలు మరియు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేయలేదు. చైనా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైటులో కూడా దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇక వైరల్ అవుతున్న వీడియో గురించి పరిశీలించగా, ముందుగా ఈ వీడియోని ఆగస్టు 2022లో ‘టిక్ టాక్’ యాప్ లో అప్‌లోడ్  చేసినట్లు గుర్తించాము. అయితే, చైనా పాఠశాలల్లో ఇలా తల్లితండ్రులు వీడియోలు పిల్లలకు చూపిస్తారు అని పోస్టులో చెప్పలేదు.

ఇక ఇదే వీడియోని ట్విట్టర్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి వెబ్‌సైటులలో కూడా అనేక తప్పుడు క్లెయిమ్‌లతో షేర్ చేశారు. ఈ వీడియో గమనిస్తే, విద్యార్ధులు బోర్డు వైపు చూస్తున్నప్పుడు దాని మీద కొన్ని వీడియోలను కనిపించేలా ఎడిట్ చేసినట్లు చూడవచ్చు. ఇటువంటి వీడియోలు ఇంటర్నెట్లో లభిస్తాయి.

అలాగే, తరగతి గదిలో విద్యార్ధులు ఏడుస్తున్న వీడియో కూడా ఈ విషయానికి సంబంధించినది కాదు. చైనాలోని ఒక పాఠశాలలో తమ టీచర్ చనిపోయాడు అని విద్యార్ధులు ఏడుస్తున్న వీడియో ఈ వీడియోకి జత చేయబడింది. ఇక ఇదే విధంగా ఎడిట్ చేయబడిన అనేక వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, చైనాలోని పాఠశాలల్లో పిల్లలకు తల్లితండ్రులు పనిచేస్తున్న వీడియోలను చూపిస్తున్నారు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll