ఇటీవల మే 2024లో, బ్రిటన్‌లోని బ్రైటన్ & హోవ్ సిటీ కౌన్సిల్ మేయర్‌గా బంగ్లాదేశ్ మూలాలు కలిగిన మహమ్మద్ అసదుజ్జమాన్ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలోనే, బ్రైటన్ నగరానికి మేయర్‌గా ఎన్నికైన మహమ్మద్ అసదుజ్జమాన్‌ను అక్కడి ముస్లింలు స్వాగతం పలుకుతున్న వీడియో అని చెప్పు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బ్రిటన్‌లోని బ్రైటన్ నగరానికి మేయర్‌గా ఎన్నికైన మహమ్మద్ అసదుజ్జమాన్‌ను అక్కడి ముస్లింలు స్వాగతం పలుకుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ అస్లామీ. ఈయన ఒక ఇస్లాం మత గురువు. UKలోని బెడ్‌ఫోర్డ్‌లో ముహమ్మద్ అస్గర్ అస్లామీ అనుచరులు ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తున్నది. మే 2024లో, బ్రిటన్‌లోని బ్రైటన్ & హోవ్ సిటీ కౌన్సిల్‌కి మేయర్‌గా మొహమ్మద్ అసదుజ్జమాన్ ఎన్నికయ్యారు. ఈ వీడియో చివరలో చూపిస్తున్న ఫోటోలో కనిపిస్తున్నది మొహమ్మద్ అసదుజ్జమాన్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని మరియు ఆ వ్యక్తికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలనే చూపిస్తున్న వీడియోలు ‘అస్లామియా ఫౌండేషన్’(Aslamiya Foundation) అనే యూట్యూబ్ ఛానెల్‌లో లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ యూట్యూబ్ ఛానెల్‌లో 11 జూన్ 2024న “Brother taking bayah with Shaykh | Bedford U.K. June 2024 ” అనే శీర్షికతో షేర్ చేసిన వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, వైరల్ వీడియోలో ప్రజలు స్వాగతం పలుకుతున్న వ్యక్తి అదే వేషదారణలో ఈ వీడియోలో ఉన్నట్లు మేము గుర్తించాము. అలాగే, వైరల్ వీడియోలో కళ్లద్దాలు మరియు ఆకుపచ్చ కండువా ధరించిన వ్యక్తి, నీలం రంగు శాలువా ధరించిన వ్యక్తిని కూడా ఈ యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు. వైరల్ వీడియోను యూట్యూబ్ వీడియోతో పోల్చి చూస్తే, ఈ రెండు వీడియోలు చూపిస్తున్నది ఒకే వ్యక్తి అని మనం నిర్థారించవచ్చు.
అలాగే ఈ యూట్యూబ్ వీడియోలలో ఒక వీడియో “Welcome of Sheikh Sufi Muhammad Asghar to Peterborough U.K.” అనే శీర్షికతో షేర్ చేయబడింది. ఈ వీడియోలో కూడా మనం కొందరు వ్యక్తులు వైరల్ వీడియోలో ప్రజలు స్వాగతం పలుకుతున్న వ్యక్తికే స్వాగతం పలుకుతుండడం మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వీడియో ప్రజలు స్వాగతం పలుకుతున్న వ్యక్తి పేరు ‘షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ ’ అని తెలుస్తుంది.
‘అస్లామియా ఫౌండేషన్’ యూట్యూబ్ ఛానెల్‌లో తమ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల లింక్‌లను కూడాషేర్ చేసింది. తదుపరి మేము ఈ ‘అస్లామియా ఫౌండేషన్’ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ పరశీలించగా, ఇదే వైరల్ వీడియోను వారి టిక్‌టాక్‌లో జూన్ 2024లో అప్‌లోడ్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో, బెడ్‌ఫోర్డ్‌లోని కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ముస్లిం కమ్యూనిటీ ఈవెంట్ కు సంబంధించింది అని ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు.
తదుపరి మేము షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ అస్లామీ యొక్క అధికారిక ఫేస్‌బుక్ పేజీ (ఆర్కైవ్డ్ లింక్) కనుగొన్నాము. ఈ ఫేస్‌బుక్ పేజీలో ముహమ్మద్ అస్గర్ అస్లామీ UKలో వివిధ మతపరమైన సమావేశాలలో పాల్గొన్న వీడియోలను మనం చూడవచ్చు.
ఇకపోతే, బ్రైటన్ & హోవ్ సిటీ కౌన్సిల్ వెబ్‌సైట్ ప్రకారం, మే 2024లో బ్రైటన్ సిటీకి కొత్త మేయర్‌గా మొహమ్మద్ అసదుజ్జమాన్ ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్‌లో జన్మించిన అసదుజ్జమాన్ 1995లో UKకి వెళ్ళాడు. గత 30 ఏళ్లుగా బ్రైటన్‌లో నివసిస్తున్నాడు. షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ అస్లామీ, బ్రైటన్ నగరానికి కొత్తగా ఎన్నికైన మేయర్ మహమ్మద్ అసదుజ్జమాన్ ఫోటోలను క్రింద చూడవచ్చు.
చివరగా, ఈ వీడియోలో ప్రజలు స్వాగతం పలుకుతున్న వ్యక్తి బ్రైటన్ & హోవ్ సిటీ కౌన్సిల్‌కి కొత్తగా ఎన్నికైన మేయర్ మహమ్మద్ అసదుజ్జమాన్ కాదు.