Fake News, Telugu
 

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) ర్యాంకింగ్స్ కేవలం ఆహారధాన్యాల సరఫరా గొలుసుపై ఆధారపడి ఉండదు

0

“హాంగర్ ఇండెక్స్‌లో మన స్థానం కంటే 36 స్థానాలు ముందు ఉండి మెరుగ్గా ఉన్న శ్రీలంకకు భారత్ ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తోంది. 3 లక్షల టన్నుల ఒప్పందంలో భాగంగా 40 వేల టన్నులు వెంటనే సరఫరా. అంతర్జాతీయ ఇండెక్స్‌లను నమ్మకండి”, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) ర్యాంకింగ్స్ కేవలం ఆహారధాన్యాల సరఫరా గొలుసుపై ఆధారపడి ఉంటుంది.

ఫాక్ట్ (నిజం): గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) స్కోర్లని ఆయా దేశాలలో పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా శాతాన్ని, న్యుట్రిషన్ లోపంతో (చైల్డ్ వాస్టింగ్, చైల్డ్ స్టున్టింగ్) బాధపడుతున్న చిన్నారుల శాతాన్ని అలాగే, అయిదు సంవత్సరాల వయసు లోపు చనిపోయిన చిన్న పిల్లల సంఖ్యని ఆధారంగా లెక్కిస్తారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ కేవలం ఆహారధాన్యాల సరఫరా గొలుసుపై ఆధారపడి ఉండదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) గణాంకాలని ఎలా లేక్కిస్తారని ఇంటర్నెట్‌లో వెతికితే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైటులో లభించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) స్కోర్లని మూడు దశల ప్రక్రియగా లెక్కించబడుతుందని ఈ వెబ్సైటులో తెలిపారు. వివిధ దేశాలు అందించిన నాలుగు ముఖ్యమైన సూచికల డేటా ఆధారంగా GHI స్కోర్లని లెక్కిస్తామని ఇందులో తెలిపారు.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్లని ఆయా దేశాలలో పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా శాతాన్ని, న్యుట్రిషన్ లోపంతో (చైల్డ్ వాస్టింగ్, చైల్డ్ స్టున్టింగ్) బాధపడుతున్న చిన్నారుల శాతాన్ని అలాగే, అయిదు సంవత్సరాల వయసు లోపు చనిపోయిన చిన్న పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని లెక్కిస్తారని GHI వారు తమ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. GHI స్కోరులని లెక్కించే పూర్తి పద్దతిని ఇక్కడ చూడవచ్చు. పోషకాహార సూచికలో భాగంగా ఆయా దేశాలలో సరిపడ ఆహార సరఫరా జరుగుతుందా లేదా అనేది కూడా GHI కొలుస్తుంది. కానీ, కేవలం ఆహారధాన్యాల సరఫరా సూచికను ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్లని లెక్కించారు.

2021 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో భారత దేశం 101వ స్థానంలో ఉండగా, శ్రీలంక 65వ స్థానంలో నిలిచింది. శ్రీలంక ప్రస్తుతం మునుపెన్నడు ఎరగని ఆర్ధిక సంక్షోభంలో ఉన్న కారణంగా, శ్రీలంక ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం శ్రీలంక దేశానికి మూడు లక్షల టన్నుల ఆహార ధాన్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం 40 వేల టన్నుల బియ్యం ధాన్యాన్ని ఇప్పటికే శ్రీలంకకు సమకూర్చింది.

చివరగా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) ర్యాంకింగ్స్ కేవలం ఆహారధాన్యాల సరఫరా గొలుసుపై ఆధారపడి ఉండదు.

Share.

About Author

Comments are closed.

scroll