Fake News, Telugu
 

పలు ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు తెలుగు రాష్ట్రాలలో ధరలకు అనుగుణంగా ఉన్నాయి

0

బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. పోస్టులో తమ వాదనకు అనుగుణంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలను బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని ధరలతో పోలుస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న వాదనకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి.

ఫాక్ట్ (నిజం): దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న రాష్టాలలో తెలంగాణ ఒకటి. ఐతే ఎన్డీయే పాలిత రాష్ట్రాలైన బీహార్ మరియు మధ్యప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర కూడా ఇంచుమించు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ధరలకు దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి కేవలం ఎన్డీయే ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్న వాదన కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పెరుగుతున్న అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్/ డీజిల్ యొక్క రిటైల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు రోజు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన పదిహేను రోజులలో పద్నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. పలు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటిపోయింది.

ఐతే వివిధ రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలకు సంబంధించి పోస్టులో షేర్ చేసిన ధరలు ఏ రోజు ధరలో తెలియనప్పటికీ, రాష్ట్రాలలో ప్రస్తుత ధరలు మాత్రం వీటికంటే ఎక్కువగానే ఉన్నాయి.

వివిధ రాష్ట్రాలలోని హెచ్‌పి (HP) బంక్ ద్వారా విక్రయిస్తున్న లీటర్ పెట్రోల్ ధరలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, దేశంలో మహారాష్ట్ర మరియు తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. పోస్టులో చెప్తున్నట్టు చాలావరకు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ధరలు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, బీహార్ మరియు మధ్యప్రదేశ్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు అధికంగానే ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఈ రోజు సగటున లీటర్ పెట్రోల్ ధర రూ. 119 ఉండగా, వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలైన బీహార్ మరియు మధ్యప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర సగటున రూ. 116 & రూ. 118 ఉంది. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాలలో ఈ ధర రూ. 120 కూడా ఉంది. దీన్నిబట్టి, కేవలం ఎన్డీయే ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, పలు ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు తెలంగాణలోని ధరలకు అనుగుణంగా ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll