Fake News, Telugu
 

హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్లామీకరణను రుజువుచేసే అధ్యయనం చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ప్రపంచంలోని ఏదైనా దేశ జనాభాలో ముస్లింల వాటా 16% దాటినట్లైతే వంద లేదా నూటయాభై ఏళ్ల లోపు దశలవారీగా ఆ దేశం ఇస్లామిక్ దేశంగా మారుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఏదైనా దేశ జనాభాలో ముస్లింల వాటా 16% దాటినట్లైతే వంద లేదా నూటయాభై ఏళ్ల లోపు దశలవారీగా ఆ దేశం ఇస్లామిక్ దేశంగా మారుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో రుజువైంది.

ఫాక్ట్: హార్వర్డ్ యూనివర్సిటీ ఇటువంటి అధ్యయనం చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వైరల్ పోస్టులోని సమాచారం కనీసం 2008 నుంచి సరైన నిర్ధారణ లేకుండా ప్రచారంలో ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, హార్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్లో వైరల్ పోస్టులో చెప్పబడిన విషయం గురించి ఏదైనా పరిశోధన జరిగిందా అని వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

అలాగే వివిధ పరిశోధనా వెబ్‌సైట్లు మరియు మీడియాలో కూడా ఎక్కడ దీని గురించి ప్రస్తావన లేదు. ఇక పోస్టులో ఉన్న సారాంశాన్ని ఇంగ్లీషులోకి అనువదించి వెతకగా, ఇదే సమాచారంతో ఉన్న వ్యాసం 2008లో ప్రచురించిన ఒక బ్లాగులో ఉన్నట్లు గుర్తించాం. అయితే ఈ సమాచారం డాక్టర్ పీటర్ హమ్మాన్డ్ రాసిన “Slavery, Terrorism & Islam” అనే పుస్తకం నుంచి తీసుకోబడిందని పేర్కొన్నారు.

అమెజాన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని యొక్క తాజా ముద్రణను పరిశీలించగా, వైరల్ పోస్టులో చెప్పబడిన సమాచారం ఈ పుస్తకంలో కూడా లేదని గుర్తించాం. అయితే ఈ పుస్తకంలో ముస్లింల గురించి మరియు ఇస్లామీకరణ గురించి రచయిత డాక్టర్ పీటర్ హమ్మాన్డ్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.

చివరిగా, దేశ జనాభాలో ముస్లింల వాటా 16% దాటినట్లైతే వంద లేదా నూటయాభై ఏళ్ల లోపు దశలవారీగా ఆ దేశం ఇస్లామిక్ దేశంగా మారుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll