Fake News, Telugu
 

మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కాంగ్రెస్ కారణమని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయలేదు

0

మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న హింసకు కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ మణిపూర్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారని ఇండియా టుడే వారి వార్తా క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.  ఈ క్లిప్‌ను ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తూ, ఈ లేఖ రాసింది మణిపూర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని, రోహింగ్యాల దొంగ ఓట్ల కోసం చూస్తే వారే ఇప్పుడు మణిపూర్ అల్లర్లకు కారణమంటూ లేఖలో పేర్కొన్నాడని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ పోస్టులోని నిజానిజాలు చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కాంగ్రెస్ కారణమంటూ మణిపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో ఇండియా టుడే ప్రచురించిన ఒక వార్తా కథనం యొక్క ఎడిటెడ్ వెర్షన్. పూర్తి వెర్షన్‌లో, మణిపూర్ పేట్రియాటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ‘నౌరెమ్ మోహేన్’ రాహుల్ గాంధీకి లేఖ రాశారు అని చెప్పారు. కావున, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.

ముందుగా, వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ‘Crisis outcome of policy by Congress’ అనే కోట్‌ను మోహేన్ అనే వ్యక్తికి ఆపాదించడాన్ని మేము గమనించాము. అలాగే, న్యూస్ క్లిప్ యొక్క 0:14 సెకన్ల మార్క్ దగ్గర, యాంకర్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన వ్యక్తి నౌరెమ్ మోహేన్ అని చెప్పడాన్ని కూడా గమనించాము.

దీన్ని క్లూగా తీసుకుని, మేము ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇది గత నెల ప్రచురితమైన కొన్ని వార్త కథనాలకి (ఇక్కడ మరియు ఇక్కడ) దారితీసింది.

మణిపూర్ పేట్రియాటిక్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నౌరెమ్ మోహేన్ అనే వ్యక్తి రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు, ఇందులో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ విధానాలను కొనసాగించడమే మణిపూర్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కారణమని రాసారు. వైరల్ వీడియో భాగమైన ఇండియా టుడే వార్తా నివేదిక యొక్క పూర్తి రిపోర్టులో, రాహుల్ గాంధీకి లేఖ రాసిన వ్యక్తి నౌరెమ్ మోహేన్ అని స్పష్టంగా పేర్కొన్నారు.

ఇండియా టుడే ప్రచురించిన ఈ వార్తా నివేదికలో మీరు నౌరెమ్ మోహేన్ రాసిన లేఖను చూడచ్చు . GroundReport.in ప్రచురించిన ఈ కథనాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నౌరెమ్ మోహేన్ గురించి మరింత తెలుసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతీయ పార్టీకి చెందిన నౌరెమ్ మోహేన్ రాసిన ఈ లేఖని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేఖ రాసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

చివరిగా, మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కాంగ్రెస్ కారణమని మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll