Fake News, Telugu
 

పాకిస్థాన్‌లో భారత జెండాను అవమానించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను కేరళలో జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు

0

భారత జాతీయ జెండాను అవమానించే విధంగా రోడ్డుపై భారత జాతీయ జెండా పెట్టి, దానిపై నుండి వాహనాలను నడుపుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. భారత జెండాను అవమానిస్తుంటే రోడ్డు పక్కన ఉన్న జనాలు పాకిస్తాన్ జండాలు పట్టుకొని ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ ఘటన కేరళలో జరిగిందంటూ షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కేరళలో భారత జెండాను రోడ్డుపై పడేసి దానిపై నుండి వాహనాలను నడుపుకుంటూ వెళ్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): కేరళలో ఇలాంటి సంఘటన జరిగినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. పైగా వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగినట్టు తెలుస్తుంది. గూగుల్ మాప్స్ ద్వారా వెతకగా వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాలు కరాచిలోని ఢిల్లీ మర్కంటైల్ సొసైటీ ప్రాంతం అని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేరళలో ఇలాంటి ఘటనలు జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. పైగా వీడియోను జాగ్రతగా పరిశీలించినప్పుడు ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగినట్టు మనకు ఆధారాలు కనిపిస్తాయి.

వైరల్ అవుతున్న వీడియోలో 3:38 టైమ్‌స్టాంప్ వద్ద ‘ది హునార్ ఫౌండేషన్’ అని రాసి ఉన్న తెల్లటి వ్యాన్ ప్రయాణిస్తున్నట్లు గమనించవచ్చు. దీని ఆధారంగా ‘ది హునార్ ఫౌండేషన్’ యొక్క వెబ్‌సైట్‌లో వెతకగా, అందులోని సమాచారం ప్రకారం ఈ సంస్థ కరాచీ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ పాకిస్థాన్ యువతకు నైపుణ్యాభివృద్ధి/సాంకేతిక శిక్షణను అందిస్తుంది. అచ్చం ఇలాంటి వాహనాల ఫోటోలను కరాచీలోని ఒక ప్రింటింగ్ షాపు ఫేస్‌బుక్ పేజీలో చూడవచ్చు.

వీడియోలో 3:44 సెకన్ల వద్ద పసుపు రంగు నంబర్ ప్లేట్‌పై ‘BFK-625’ అని వ్రాసి ఉన్న కారుని గమనించవచ్చు. గూగుల్‌లో వెతకగా ఇలాంటి నంబర్ ప్లేట్‌లు పాకిస్తాన్‌లోని కరాచీ రాజధాని అయిన సింధ్ ప్రావిన్స్‌లో వినియోగిస్తారని తెలిసింది. వైరల్ వీడియోలో ఉన్నటువంటి వాహన నంబర్ ప్లేట్ల చిత్రాలను ప్రచురించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

వీడియో ప్రారంభంలో ‘సనమ్’ అనే పేరుతో ఒక షాప్ కనిపిస్తుంది. దీని ఆధారంగా గూగుల్‌లో వెతకగా కరాచీలోని ‘సనమ్’  పెరుతో ఉన్న బోటిక్ లొకేషన్ తెలిపే రెండు వెబ్‌సైట్స్ మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ వెబ్‌సైట్స్‌లో ‘సనమ్’ లోగో వీడియోలో మనకు కనిపిస్తున్న లోగో ఒకేలా ఉండడం గమనించవచ్చు.

పైన తెలిపిన వెబ్‌సైట్‌ల ప్రకారం ఈ స్టోర్ కరాచీలోని తారిఖ్ రోడ్, ఢిల్లీ మర్కంటైల్ సొసైటీలో ఉంది. దీని ఆధారంగా గూగుల్‌ మ్యాప్‌లో వెతకగా కరాచీలో అదే పేరుతో ఒక షాప్ కనిపించింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా పరిశీలిస్తే ఈ షాప్ చుపక్కల ప్రాంతం వైరల్ వీడియోలో కనిపించే ప్రాంతాన్ని పోలినట్టు ఉంది. వీటన్నిటిబట్టి వైరల్ వీడియోలోని ఘటన పాకిస్తాన్‌లో జరిగిందని, కేరళలో కాదని స్పష్టమవుతుంది.

చివరగా, పాకిస్థాన్‌లో భారత జెండాను అవమానించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను కేరళలో జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll