“బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఒక హిందూ మహిళపై అత్యాచారం చేసి, తల నరికి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మొక్కజొన్న పొలంలో పడేశారు” అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా మొక్కజొన్న పొలంలో తల లేని ఓ మృతదేహం పడి ఉన్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఇదే వీడియోను షేర్ చేస్తూ, బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో ఒక హిందూ మహిళను ముస్లింలు అత్యాచారం చేసి చంపారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఒక హిందూ మహిళపై అత్యాచారం చేసి, తల నరికి, ఆమె మృతదేహాన్ని మొక్కజొన్న పొలంలో పడేశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించినది కాదు. ఈ వీడియో ఫిబ్రవరి 2025లో బీహార్‌లోని మోతిహరి జిల్లా (తూర్పు చంపారన్) రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటనలో మృతరాలి, నిందుతుల వివరాలు ఇంకా తెలియరాలేదని రాజేపూర్ పోలీసులు Factly తో చెప్పారు. అలాగే, ఇటీవల బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన జరిగినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియోను ఫిబ్రవరి 2025లో సోషల్ మీడియాలో పలువురు షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ, ఇక్కడ). ఈ ఘటన బీహార్‌లోని మోతిహరి జిల్లాలో జరిగినట్లు ఈ పోస్టులు పేర్కొన్నాయి.

ఈ క్రమంలోనే, వైరల్ వీడియోలోని దృశ్యాలను కలిగి ఉన్న మరొక వీడియోను బీహార్‌లోని మోతిహరి జిల్లాకు చెందిన వ్యక్తి 28 ఫిబ్రవరి 2025న ఫేస్‌బుక్‌లో షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోలో కనిపిస్తున్న బైక్ నంబర్ ప్లేట్ మీద BR (బీహార్) అని రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అంటే, ఈ సంఘటన బీహార్‌లో జరిగి ఉండవచ్చు.

తదుపరి ఈ సమాచారం ఆధారంగా ఈ సంఘటనకు సంబంధించిన వివరాల తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ 26 ఫిబ్రవరి 2025న పబ్లిక్ న్యూస్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒక కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, మోతిహరి జిల్లా (తూర్పు చంపారన్) రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలింపూర్ గ్రామంలోని మొక్కజొన్న పొలంలో తల లేని మహిళ మృతదేహం దొరికింది. మృతురాలు నీలం రంగు చీర, బ్లౌస్ ధరించి ఉందని, మృతురాలికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని, రాజేపూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని ఈ కథనం పేర్కొంది.

26 ఫిబ్రవరి 2025న ప్రచురించబడిన ‘ప్రభాత్ ఖబర్’ వార్తా కథనం ప్రకారం, బీహార్‌లోని రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధి గండక్ నది ఎడమ ఒడ్డున గాలింపూర్ గ్రామ సమీపంలోని మొక్కజొన్న పొలంలో 30 నుండి 40 ఏళ్ల తల లేని ఒక మహిళ మృతదేహం దొరికింది. ఆమె తల దగ్గరలోని ఒక గోధుమ పొలంలో లభ్యమైంది. రాజేపూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. FSL బృందం దర్యాప్తు పూర్తి చేసిందని, మృతదేహాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయిని, అలాగే హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పకాడియాల్ డిఎస్పీ మోహిబుల్లా అన్సారీ ప్రభాత్ ఖబర్‌తో చెప్పారని ఈ కథనం పేర్కొంది.

ఈ సమాచారం ఆధారంగా, మేము ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి బీహార్ పోలీసు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ సంఘటనకు సంబంధించి రాజేపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయబడిన FIR కాపీని మేము పరిశీలించాము. FIR ప్రకారం, రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలింపూర్ ఆనకట్ట సమీపంలోని మొక్కజొన్న తోటలో తల లేని గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహం లభ్యమైంది, మృతురాలు నీలం రంగు చీర మరియు బ్లౌస్ ధరించి ఉందని, పదునైన ఆయుధంతో ఆ మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు FIR లో పేర్కొన్నారు. ఈ హత్యకి సంబంధించి నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం బీహార్ మోతిహరి జిల్లాలోని రాజేపూర్ పోలీసులను మేము సంప్రదించగా, మాతో (Factly) మాట్లాడుతూ రాజేపూర్ SHO ముఖేష్ కుమార్, “ఈ వైరల్ వీడియో ఇటీవల ఫిబ్రవరి 2025లో తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలింపూర్ గ్రామంలోని ఒక మొక్కజొన్న పొలంలో తల లేని మహిళ మృతదేహం దొరికిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుందని, అలాగే ఈ ఘటనలో మృతరాలి, నిందుతుల వివరాలు ఇంకా తెలియరాలేదని” చెప్పారు. అలాగే, ఈ వైరల్ వీడియో రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్యకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుందని మోతిహరి ఎస్పీ కూడా ధృవీకరించారు.
అలాగే, ఇటీవల బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తాకథనాలు లభించలేదు.
చివరగా, ఈ వైరల్ వీడియో ఫిబ్రవరి 2025లో బీహార్ మోతిహరి జిల్లాలోని రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్యకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.